ప్ర‌శ్నిస్తే…? వేధిస్తారా..?

-పేపర్ల లీకేజీపై ప్రశ్నించిన రేవంత్ రెడ్డిని సిట్ కార్యాల‌యానికి పిల‌డ‌వం ఏంటి..?
-ప్ర‌భుత్వ నియంతృత్వ‌ పోకడలకు నిదర్శనం
-నిరుద్యోగ యువ‌తీ, యువ‌కులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు
-ఎన్నికల్లో ఓట్ల కోసమే పంట నష్ట పరిశీలన
-సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ ధ్వ‌జం

CLP leader Bhatti Vikramarka: TSPSC ప్రశ్నపత్రం లీకేజీ విష‌యంలో ప్ర‌శ్నించిన పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిని వేధించ‌డం ఏమిట‌ని సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న పాద‌యాత్ర‌లో భాగంగా కెరిమెరి మండలం ఝరిలో ఆయ‌న మాట్లాడారు. రేవంత్ రెడ్డిని సిట్ కార్యాలయానికి పిలవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. ఎక్కడైనా దర్యాప్తు అధికారులకు సమాచారం కావాలంటే.. వారి ఇండ్లకు వెళ్లి సమాచారాన్ని సేకరిస్తారని, కానీ ఇక్క‌డ అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. పీసీసీ అధ్యక్షుడిని సిట్ కార్యాలయానికి పిలిపించడం అంటే.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలను, అసలు నేరస్థులకు కాపాడడం కోసమేన‌న్నారు.

జనాల్లోకి తప్పుడు సంకేతాలు పంపడం కోసం రేవంత్‌రెడ్డిని పిలిపించినట్లు కనిపిస్తోందని భ‌ట్టి స్ప‌ష్టం చేశారు. ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నాయకులను భయపెట్టేలా, వారి గొంతు నులిమేలా చేయడం నియంతృత్వ‌ పోకడలకు నిదర్శనమ‌న్నారు. సిట్ అధికారుల బెదిరింపులకు లొంగేది లేదని ఆయ‌న వెల్ల‌డించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ సర్వసాధారణం అని చెప్పిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యత రాహిత్యంగా వ్యాఖ్యలు చేసిన ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వారు పాలించడం సిగ్గుచేటన్నారు.

ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంతో విద్యార్థులు, నిరుద్యోగులు మాన‌సిక క్షోభ‌కు గుర‌వుతున్నార‌ని అన్నారు. విద్యార్థులకైన ఖర్చులను సహేతుకంగా లెక్కించి ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ సభ్యులు, సెక్రెటరీ లను వెంటనే తొలగించాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ యువతీ యువకుల భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తున్నదన్నారు. ఈ ప్రభుత్వాన్ని సంఘటితంగా పోరాటం చేసి తొలగించుకుందామ‌ని విద్యార్థులు, నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.

విద్యార్థి, నిరుద్యోగులు చేసే పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నదని తెలిపారు. ప్రతిపక్షాల పోరాట ఫలితంగానే కేసీఆర్ పంట పరిశీలనకు బయలుదేరిండన‌ని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక సీజన్లో కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేద‌ని, ఎన్నికల ఓట్ల కోసమే పంట నష్ట పరిశీలనకు సీఎం కేసీఆర్ బయలుదేరిండని ఎద్దేవా చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like