క‌మ‌ల వికాసం

-ఉమ్మ‌డి ఆదిలాబాద్‌లో గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తి సాధించిన బీజేపీ
-రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హ‌వా త‌ట్టుకుని నాలుగు స్థానాలు కైవ‌సం

BJP: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అనూహ్యంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ పుంజుకుంది. మొద‌టి నుంచి అంచ‌నాల‌కు మించి దూకుడు ప్ర‌ద‌ర్శించిన ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌య తీరాల‌కు చేరారు. ఆ పార్టీకి గ‌తంలో ఎన్న‌డూ లేని మైలేజీ ద‌క్కింది. ముందు నుంచి స‌ర్వే ఫ‌లితాలు ఊహించిన‌ట్లుగా ఆ పార్టీ నేత‌లు విజ‌యం సాధించారు. ఆపార్టీ నాలుగు చోట్ల గెల‌వ‌డం మ‌రికొన్ని చోట్ల రెండో స్థానంలో నిల‌వ‌డం, పార్టీకి ఓటు బ్యాంకు విప‌రీతంగా పెరిగిపోవ‌డం బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపింది.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ త‌న బ‌లం విప‌రీతంగా పెంచుకుంది. గ‌తంలో చాలా చోట్ల మూడో స్థానానికే ప‌రిమితం అవ‌డం, కొన్ని చోట్ల డిపాజిట్లు సైతం రాక‌పోవ‌డంతో ఆ పార్టీపై ఎవ‌రికీ పెద్ద‌గా అంచనాలు లేకుండా పోయాయి. కానీ, అది నాలుగు స్థానాల్లో గెలిచి ఇత‌ర పార్టీల‌కు షాక్ ఇచ్చింది. బీజేపీ ఎలాంటి అంచ‌నాలు లేకుండానే ఈ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగింది. అయితే, ప‌క‌డ్బందీ వ్యూహంతో ఆ పార్టీ ముందుకు సాగింది. మొద‌ట‌గా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఎక్క‌డ గెలుపున‌కు ద‌గ్గ‌రికి వెళ్తామో అక్క‌డ పూర్తిగా ఫోక‌స్ చేసింది. అదే స‌మ‌యంలో అలాంటి నియోజ‌కవ‌ర్గాల్లోనే అగ్ర నేత‌ల ప‌ర్య‌ట‌ల‌ను పెట్టుకున్నారు. ప్ర‌ధాన‌మంత్రి మోదీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ, కిష‌న్‌రెడ్డి, ఈటెల రాజేంద‌ర్, కేంద్ర మంత్రులు ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ప్ర‌చారంలో పాల్గొని పార్టీకి నూత‌న జ‌వ‌స‌త్వాలు క‌ల్పించ‌డంలో కృత‌కృత్యుల‌య్యారు. అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోయ‌డ‌మే కాకుండా, స్థానిక స‌మ‌స్య‌లు సైతం లేవ‌నెత్తుతూ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. దీంతో అస‌లు పోటీలోనే ఉండ‌రు అనే స్థాయి నుంచి వాళ్లే గెలుస్తారు.. అనే స్థాయి వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు.

ప్ర‌జ‌ల్లో సైతం న‌మ్మ‌కం క‌ల‌గ‌డంతో బీజేపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. ఆదిలాబాద్లో పాయ‌ల్ శంక‌ర్, నిర్మ‌ల్‌లో ఏలేటీ మ‌హేశ్వ‌ర్ రెడ్డి, సిర్పూర్‌లో పాల్వాయి హ‌రీష్‌బాబు, ముథోల్ రామారావుప‌టేల్‌ గెలుపొందారు. వాస్త‌వానికి బోథ్‌లో ఎంపీ సోయం బాపూరావు గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఆయ‌న గెలుపు సైతం ఖాయ‌మ‌ని భావించారు. ఆయ‌న రెండో స్థానానికే ప‌రిమితం అయ్యారు. మంచిర్యాల‌ బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునాథ్ అనూహ్యంగా రెండో స్థానానికి దూసుకువెళ్లారు. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 5,018 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఈసారి 39,370 ఓట్లు వ‌చ్చాయి. ముందు నుంచి ఇక్క‌డ ఆ పార్టీకి పెద్ద‌గా ఓటు బ్యాంకు లేదు. కానీ, ఈ ఎన్నిక‌ల్లో భారీ స్థాయిలో ఓట్లు సాధించ‌గ‌లిగారు.

బీజేపీకి గ‌తంలో ప‌ట్ట‌ణ ఓట‌ర్లు మాత్ర‌మే మొగ్గు చూపేశారు. కానీ, ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో కమలం గాలి బలంగా వీచింది. అంతేకాకుండా, ఉద్యోగులు, యువ‌త సైతం అటు వైపు మొగ్గు చూపారు. అంతేకాకుండా, మైనారిటీ ఓట‌ర్లు బ‌లంగా ఉన్న చోట్ల మిగ‌తా వ‌ర్గాలు మొత్తం బీజేపీ వైపు నిల‌బ‌డ‌టం ఆ పార్టీకి క‌లిసి వ‌చ్చే అంశాలుగా చెబుతున్నారు. ఇలా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అనూహ్యంగా పుంజుకోవ‌డంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థ‌లు, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తాము మ‌రింతగా పుంజుకుని ముందుకు వెళ్తామ‌ని బీజేపీ శ్రేణులు స్ప‌ష్టం చేస్తున్నాయి.

రాష్ట్రమంతా కాంగ్రెస్ హ‌వా కొన‌సాగ‌గా, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఆ పార్టీకి జోరుకు బ్రేక్ ప‌డింది. వాస్త‌వానికి నాలుగు జిల్లాలు బీఆర్ఎస్ కంచుకోట‌గా మారాయి. ఆ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డంతో పాటు కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది. బ‌ల‌మైన నేత‌ల‌ను సైతం మ‌ట్టి క‌రిపించింది. మ‌రోవైపు రాష్ట్రవ్యాప్తంగా కూడా బీజేపీ గ‌ణ‌నీయ‌మైన ఓటు బ్యాంకు సాధించింది. 2018 ఎన్నిక‌ల్లో కేవ‌లం ఏడు శాతం ఓట్ల షేరింగ్‌తో కేవ‌లం ఒకే స్థానానికి ప‌రిమితం అయ్యింది. కాగా, ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో 14 శాతం ఓట్ల షేరింగ్ తో 8 స్థానాలు సాధించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like