బొగ్గు నాణ్యతపై శ్రద్ధ అవసరం

నాణ్యత పెంపుదలతో వినియోగదారుల విశ్వాసం పొందాలి - విదేశీ బొగ్గుతో పోటీ పడాలంటే నాణ్యత పాటింపు తప్పనిసరి - సింగరేణి వ్యాప్తంగా జి.ఎం.లు గనుల అధికారులతో నాణ్యతపై సమీక్ష - డైరెక్టర్‌ ఆపరేషన్స్ ఎస్‌.చంద్రశేఖర్‌ ఆదేశం

బొగ్గు నాణ్య‌త‌పై మ‌రింత శ్ర‌ద్ధ అవ‌స‌ర‌మ‌ని డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) చంద్రశేఖర్ స్ప‌ష్టం చేశారు. మంగళవారం హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి ఆయన అన్ని ఏరియాల జి.ఎం.లు, ఓ.సి. గనుల ప్రాజెక్టు అధికారులు, యూజీ గనుల ఏజెంట్లు, క్వాలిటీ జి.ఎం.తో పాటు ఏరియా క్వాలిటీ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వినియోగదారులకు నిర్దేశిత గ్రేడు బొగ్గు సకాలంలో అందించగలిగితేనే వారి విశ్వాసాన్ని చూరగొనగలమని స్ప‌ష్టం చేశారు. నాణ్యత బొగ్గు అందించే వారి వద్దకే వినియోగదారులు వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయ‌న్నారు. అందుకే సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నేటి పోటీ మార్కెట్టు దృష్టిలో ఉంచుకొని నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

గతానికి భిన్నంగా వినియోగదారులందరూ నాణ్యత గల బొగ్గు మాత్రమే స్వీకరించడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. విదేశీ బొగ్గు ధర కూడా తగ్గుతూ వస్తోందన్నారు. స్వదేశీ బొగ్గు కంపెనీలు అందించే బొగ్గులో నాణ్యత లోపం కారణంగా పలు పరిశ్రమలు ఇప్పటికే విదేశీ బొగ్గును దిగుమతి చేసుకొనే పరిస్థితులు ఉన్నాయని స్ప‌ష్టం చేశారు. నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సింగరేణి సంస్థ కూడా నేటి మార్కెట్టు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నాణ్యత మరింత మెరుదులకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులకు సరఫరా చేసే బొగ్గు నాణ్యత నిర్ధారించడానికి సింగరేణిలో ఇప్పటికే థర్డ్‌ పార్టీ శాంప్లింగ్‌ ను ప్రామాణికంగా తీసుకుంటున్నామ‌న్నారు. ఇవ్వవలసిన గ్రేడు బొగ్గు కన్నా ఒక్క గ్రేడు తగ్గినాసరే పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లించాల్సి వస్తోందని స్ప‌ష్టం చేశారు. అందుకే గని స్థాయి కార్మికుల దగ్గర నుండి ఏరియా జి.ఎం. స్థాయి వరకూ ప్రతీ ఒక్కరూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.

స‌మావేశంలో ఆయనతో పాటు ఎగ్గిక్యూటీవ్‌ డైరెక్టర్‌ (కోల్‌ మూమెంట్‌) ఆల్విన్‌, జనరల్‌ మేనేజర్‌ (కో ఆర్డినేషన్‌, మార్కెటింగ్‌) సూర్యనారాయణ, జి.ఎం. (స్ట్రాటజిక్‌ ప్లానింగ్‌) సురేందర్‌, డి.జి.ఎం. లు తాడబోయిన శ్రీనివాస్‌, మారెపల్లి వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

నిర్దేశిత లక్ష్యాలను నాణ్యతతో సాధించాలనీ, తక్కువ నాణ్యత గల బొగ్గును సరఫరా చేయడం వల్ల లాభాల కన్నా నష్టాలను చవిచూడాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. గనుల వారీగా నాణ్యత పెంపుదలకు తీసుకుంటున్న చర్యలను ఏరియా అధికారులు వివరించగా డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ మరికొన్ని సూచనలు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like