ఇద్ద‌రూ అమ్మాయిలే.. పెండ్లి చేసుకోవాల‌నుకున్నారు..

-అనుమానస్ప‌ద స్థితిలో ఒక‌రు మృతి.. తీవ్ర గాయాల‌తో మ‌రొక‌రు
-ఆత్మ‌హ‌త్యాయ‌త్న‌మా..? ఎవ‌రైనా హ‌త్య చేశారా..?
-ప‌లు కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఇద్ద‌రూ అమ్మాయిలే.. ప్రేమించుకున్నారు… పెండ్లి చేసుకోవాల‌నుకున్నారు. కొద్ది రోజులుగా క‌లిసి ఒకే రూంలో ఉంటున్నారు. ఏమైందో ఏమో అనుమాన‌స్ప‌ద‌స్థితిలో ఒక‌రు మృతి చెంద‌గా, మ‌రొక‌రు తీవ్ర గాయాల‌తో క‌నిపించారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచార‌ణ నిర్వ‌హిస్తున్నారు.

అంజ‌లి, మ‌హేశ్వ‌రి అనే అమ్మాయిలు ఇద్ద‌రూ బంధువులు. వీరిద్ద‌రూ ప్రేమించుకున్నారు. పెండ్లి కూడా చేసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందులో మహేశ్వరి ట్రాన్స్ జెండర్. పెండ్లి చేసుకోవాల‌నుకున్న వీరు కొద్ది రోజులుగా ప్ర‌త్యేకంగా క‌లిసి ఉంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఒక రూం అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు.

కాగా, ఏమైందో తెలియ‌దు కానీ, వీరిద్ద‌రు రామకృష్ణాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అప‌స్మార‌క స్థితిలో క‌నిపించారు. తీవ్ర గాయాలతో ఉన్న అంజలి, మహేశ్వరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌లో అంజలి మృతి చెంద‌గా, మ‌హేశ్వ‌రి తీవ్ర గాయాల‌తో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

వీరిద్ద‌రూ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారా..? లేక ఎవ‌రైనా హ‌త్యాయ‌త్నం చేశారా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అంజలి మృతి అనుమానాస్పద మృతిగా న‌మోదు చేశారు. అయితే, అంజలిని గొంతుకోసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల అంజలి.. మహేశ్వరితో సరిగ్గా వుండక పోవడం వివాహ విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడినట్లు స‌మాచారం. గొడవ విషయంలో నిన్న వీరిద్దరితో మరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది.

కాల్ రికార్డులు పరిశీలిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like