గ‌రుడ‌పంచ‌మి

BRS: ఇప్పుడే…. ఇంకో గంట‌లో జాబితా విడుద‌ల‌… ఇవ్వాలో… రేపో… కాదు… కాదు.. ఫ‌లానా రోజు… ఇదీ తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల‌లో ప్ర‌తిరోజూ సాగుతున్న చ‌ర్చ‌. కొంద‌రైతే ఏకంగా ఇదిగో జాబితా అంటే సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. మీడియా సైతం దీనిపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేయ‌డంతో బ్రేకింగ్ ల‌తో మారుమోగుతోంది. కానీ, ప్ర‌తి విషయానికి ముహూర్తం చూసుకుని మ‌రీ ప‌నిచేసే ముఖ్య‌మంత్రి కేసీఆర్ అభ్య‌ర్థుల జాబితాకు సైతం ముహూర్తం పెట్టి ముందుకు సాగుతున్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించారు. అనేక సర్వేలు నిర్వహించి అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేశారు.అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉండడంతో, సెప్టెంబర్ లోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే ముందుగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుని ప్రకటించేందుకు ప్లాన్ చేసుకుంది. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు సమయం ఉంటుందని భావిస్తున్నారు.ఈ మేరకు అభ్యర్థుల జాబితాపై కేసీఆర్ అంచనాకు వచ్చారు. తుది జాబితా సిద్ధం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

ఆరోజే జాబితా వెల్ల‌డి…
ఇది శ్రావ‌ణ‌మాసం కావ‌డంతో ముఖ్య‌మంత్రి మంచి ముహూర్తం కోసం ఎదురుచూశారు. ఈ నెల 21న గ‌రుడ‌పంచ‌మి మంచి రోజు కావ‌డంతో ఆ రోజే తొలి జాబితా ప్ర‌క‌టించనున్నారు. వాస్త‌వానికి 18న శ్రావణ మొదటి శుక్రవారం కావడంతో అదే రోజున అభ్యర్థుల జాబితా ప్రకటిస్తార‌ని భావించారు. కానీ, ఆ రోజు ప్ర‌క‌టించ‌లేదు. ఇక రోజు ఇవాలో, రేపో అన్న‌ట్లుగా ప‌లువురు జాబితా కోసం ఆశ‌తో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆశావ‌హులు త‌మ‌కు టిక్కెట్టు వ‌స్తుందో ..? రాదో..? అనే ఆలోచ‌న‌తో టెన్ష‌న్ ప‌డుతున్నారు. 21న ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి జాబితా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

కొన్ని చోట్ల మాత్ర‌మే మార్పులు.. చేర్పులు…
కేసీఆర్ సిట్టింగ్ అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే ఛాన్స్ ఇచ్చేలా క‌నిపిస్తోంది. కేవ‌లం కొన్ని చోట్ల మాత్రమే మార్పులు ఉండే అవకాశం ఉన్న‌ట్లు భావిస్తున్నారు. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలతో స్నేహం లేనట్టేన‌ని ప‌లువురు రాజ‌కీయ ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌త రెండు నెల‌లుగా ఈ జాబితాపై కుస్తీ ప‌డుతున్నారు. ఎవ‌రెవ‌రు గెలుస్తారు..? మార్పులు, చేర్పులు చేస్తున్న స్థానాల్లో కొత్త వారిలో ఎవ‌రికి ఇవ్వాలి..? ఇలా చాలా అంశాల‌పై ఆయ‌న క‌స‌ర‌త్తు చేశారు. చివ‌ర‌కు జాబితా సిద్ధం చేసిన కేసీఆర్ 21న ప్ర‌క‌టించ‌నున్నారు.

అసంతృప్తుల‌కు బుజ్జ‌గింపులు..
అటు జాబిత‌పై దృష్టి సారించిన ముఖ్య‌మంత్రి అదే స‌మ‌యంలో అసంతృప్త నేత‌ల‌ను బుజ్జ‌గించే ప‌నిలో ప‌డ్డారు. ఎన్నో ఏండ్లుగా పార్టీనే న‌మ్ముకున్న వారికి, ఈసారి ఖ‌చ్చితంగా త‌మ‌కు టిక్కెట్టు వ‌స్తుంద‌ని భావిస్తున్న వారిని ఆయ‌నే స్వ‌యంగా పిలిపిస్తున్నారు. వారితో మాట్లాడ‌మే కాకుండా, భ‌విష్య‌త్తులో స‌రైన స్థానం క‌ల్పిస్తామ‌ని చెబుతున్నారు. ఇలా అన్ని జిల్లాల నుంచి వారిని పిలిపించి మాట్లాడి భరోసా క‌ల్పిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like