మ‌హిళ‌ల‌పై బీఆర్ఎస్ నేత‌ల ఆగ‌డాలు

BRS Leaders: బీఆర్ఎస్ నేత‌లు మ‌హిళ‌లను వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని, దీనిని పోలీసులు చూస్తు ఊరుకోవ‌డం సరికాద‌ని మంచిర్యాల మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంచిర్యాల పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జెల హేమలత బుధ‌వారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ మహిళ తన భర్త కాపురానికి తీసుకెళ్లడం లేద‌ని, తనపై దాడులకు పాల్పడుతున్నాడ‌ని బీఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు బింగి ప్రవీణ్ సాయం కోరింద‌న్నారు. అదే అవకాశంగా తీసుకొని ఆ మహిళకు అర్ధరాత్రి, తెల్లవారుజామున ఫోన్లు చేయడం, మెసేజ్లు పంపిస్తున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాయం అడ‌గానికి వ‌చ్చిన మ‌హిళ‌ను వేధించడం ఏ మేర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు.

బింగి ప్రవీణ్ వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్ వెళ్లిన ఆ మ‌హిళ భర్త, అత్తమామలపై ఒక ఫిర్యాదు, బింగి ప్రవీణ్ పై మరో ఫిర్యాదు చేసిందన్నారు. బింగి ప్రవీణ్ చేసిన వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చూపించినా కూడా పోలీసులు కేవలం ఆ మ‌హిళ భర్త, అత్తమామలపై ఇచ్చిన ఫిర్యాదు పై మాత్రమే దర్యాప్తు చేస్తున్నార‌ని, బీఆర్ఎస్‌ నేత ప్రవీణ్ పై ఇచ్చిన ఫిర్యాదు ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఎమ్మెల్యే దివాకర్ రావు,ఆయన తనయుడు విజిత్ రావు గుండాలను, రౌడీలను అనుచరులుగా పెట్టుకొని, పదవులు కట్టబెట్టి పెంచి పోషిస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు.

రాష్ట్రంలో జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల వేధింపుల వల్ల మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోబోమని గజ్జెల హేమలత హెచ్చ‌రించారు. బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్ష పదవి నుంచి అతనిని తొలగించాలన్నారు. ప్రవీణ్ పై వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like