మ‌ళ్లొచ్చినాయిరో… మాయ‌దారి విత్త‌నాలు

-సీజ‌న్ కంటే ముందే చేరుకున్న బీటీ విత్త‌నాలు
-వ్యాపారుల నుంచి గ్రామాల‌కు చేరిక‌
-ముందే నిల్వ చేసుకుంటున్న చిన్న వ్యాపారులు
-ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున వ‌స్తున్న వైనం
-ఇప్ప‌టి నుంచే నిఘా పెట్టాల‌ని కోరుకుంటున్న ప్ర‌జ‌లు

Manchiryal: ఏటా న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు కొంప‌ముంచుతున్నాయి. గ్లైసిల్‌ విత్తనాలు పెద్ద ఎత్తున పల్లెలకు చేరుతూనే ఉన్నాయి. సీజ‌న్ ప్రారంభంలో అధికారులు, పోలీసుల నిఘా ఉంటుంద‌ని గ‌మ‌నించిన న‌కిలీ విత్త‌న వ్యాపారులు తెలివిగా ముందుగానే చేర‌వేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌ల్లెల‌కు ఈ విత్త‌నాలు చేరుకున్నాయి. ఇప్పుడే వీటిపై దృష్టి పెడితే ఫ‌లితం ఉంటుంద‌ని ప‌లువురు చెబుతున్నారు. రెండు రోజుల కింద‌ట టాస్క్ఫోర్స్ పోలీసులు తాండూరు మండ‌లంలో 5 క్వింటాళ్ల న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు ప‌ట్టుకోవ‌డం ఇదే అంశాన్ని స్ప‌ష్టం చేస్తోంది.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప్ర‌తి ఏటా గ్లైసిల్ విత్త‌నాల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. ఏటా వీటిని అమ్ముతూ వ్యాపారులు కోట్లు గ‌డిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంప‌ల్లి, మాదారం, నెన్న‌ల‌, భీమిని, తిర్యాణి, సిర్పూర్‌, ఆసిఫాబాద్ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో న‌కిలీ విత్త‌నాలు జోరుగా రాజ్య‌మేలుతున్నాయి. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొంద‌రు వ్య‌క్తులు ఇక్క‌డ పాగా వేసి విత్త‌నాల వ్య‌వ‌హారం న‌డిపిస్తున్నారు. మరికొంద‌రు ఇక్క‌డ తెలివిగా భూములు కౌలుకు తీసుకుని మ‌రీ చుట్టు ప‌క్క‌ల రైతులు ఈ విత్త‌నాలు అంట‌గ‌డుతున్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్ర‌వ‌రి, మార్చి నకిలీ విత్తనాలు డంప్ చేస్తున్నారు. అప్పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వ్యాపారులు త‌మ ప‌నిని య‌థేచ్ఛ‌గా సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డంప్ చేసుకుని మ‌రీ రైతుల‌కు అంట‌గ‌డుతున్నారు. ఆంధ్రా ప్రాంతం నుంచి టన్నుల కొద్ది విత్తన ప్యాకెట్లు రాష్ట్రనికి డంప్ అవుతున్నాయి.

ఈ ఏడాది ఇప్ప‌టికే చాలా చోట్ల డంప్‌లు తీసుకువ‌చ్చి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. గ‌త ఏడాది సైతం దాదాపు 60 శాతం మేర గ్లైసిల్‌ విత్త‌నాలే సాగు చేశారంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. ఇలా సాగు చేసిన రైతులు పూర్తి స్థాయిలో న‌ష్ట‌పోయారు. గ‌డ్డి మొల‌వ‌ద‌నే ఉద్దేశంతో రైతులు వీటిపైపు మొగ్గు చూపుతున్నారు. వారి అమాయ‌క‌త్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ విత్త‌నాలు అమ్ముతున్నారు. గ్లైసిల్‌ విత్తనాలతో పర్యవరణానికి ముప్పుతో పాటు నేల నిస్సారమవుతుందనే విషయంపై అధికారులు చైతన్యం చేయ‌డం లేదు. దీంతో నాలుగేళ్లుగా నకిలీ విత్తనాల సమస్య పెరిగిపోతూనే ఉంది. ఈ సంవత్సరం కూడా అవే విత్తులతో సాగు చేయాలనే ఆలోచనతో దళారులను ఆశ్రయిస్తున్నారు. కలుపు కష్టం లేకుండా దిగుబడి కోసం గ్లైసిల్‌ విత్తనాలపై ఆధారపడటం ఎక్కువ అయ్యే సరికి విత్తన మోసాలు పెరిగిపోయాయి. రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకుని వ్యాపారులు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.

-బెల్లంప‌ల్లిలోని ఓ వ్యాపారి ఈ గ్లైసిల్ విత్త‌నాలు అమ్మి కోట్లు గ‌డించాడు. ఆయ‌న బీమిని, నెన్న‌ల‌, బీమిని, ద‌హెగాం త‌దిత‌ర ప్రాంతాల‌కు అక్క‌డ ఉన్న చిన్న వ్యాపారుల‌కు వీటిని పంపిస్తున్నాడు. అక్క‌డ వారు అమాయ‌కులైన రైతుల‌కు అంట‌గ‌డుతున్నాడు.
-తాండూరు మండ‌లంలో సైతం ఓ వ్యాపారి ఈ గ్లైసిల్ విత్త‌నాల వ్యాపారం చేస్తున్నాడు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తి సైతం ఈ విత్త‌నాలు అమ్మి ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. గ‌తంలో ఈ వ్య‌వ‌హారంలో దొరికినా మ‌ళ్లీ అవే విత్త‌నాలు అమ్ముతుడున్నాడు.
-తాండూరు ప్రాంతం నుంచి సైతం బీమిని, క‌న్నెప‌ల్లి, తిర్యాణి మండ‌లాల‌కు స‌ర‌ఫ‌రా అవుతున్నాయి.
-ఇక మాదారం ప్రాంతానికి చెందిన ఓ ఆంధ్రా వ్య‌క్తి సైతం ఇక్క‌డ భూములు కౌలుకు తీసుకుని విత్త‌నాలు అమ్ముతున్నాడు.
-బీమిని, క‌న్నెప‌ల్లి ప్రాంతాల్లో సైతం కొంద‌రు వ్యాపారులు ఇప్ప‌టికే ఈ విత్త‌నాలు నిల్వ చేసుకున్నారు.
-కాగ‌జ్‌న‌గ‌ర్‌లో సైతం వ్యాపారులు చుట్టుప‌క్క‌ల మండ‌లాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు.

విత్త‌నాల‌తో య‌మ డేంజ‌ర్‌..
నిషేధిత బీటీ3 పత్తి విత్తనాల వాడకం ఏటా పెరుగుతుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ విత్త‌నాలు వేసిన చెట్లు వ‌ద్ద ఉంటేనే క్యాన్స‌ర్ వ్యాపిస్తుందంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక గ్లైఫోసెట్ విత్త‌నాలు వేసుకుంటే క‌లుపు తీసేందుకు వాడే గ‌డ్డి మందు సైతం రైతుల‌కు చాలా న‌ష్టం క‌లిగిస్తోంది. రైతులు క్యాన్సర్లు, నరాల జబ్బులు, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారని ప‌ర్యావ‌ర‌ణ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. మ‌రోవైపు భూమికి సంబంధించి మిత్రపురుగులు, వానపాములు నశించి భూమి గుల్ల బారే ప్రక్రియ నిలిచిపోతున్నది. ఆ భూముల్లో ఇతర పంటలేవీ పండని స్థాయిలో నిస్సారమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. దొంగచాటుగా విత్త‌నాలు కొనుగోలు చేస్తుండ‌టంతో పంట నష్టపోయినప్పుడు రైతులకు పరిహారం అందడం లేదు. ఈ విత్త‌నాలతో ఎకరాకు 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెప్పినా.. ప్రస్తుతం 7 క్వింటాళ్లకు మించట్లేదు. కొన్ని చోట్ల నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబ‌డి మాత్ర‌మే వ‌స్తోంది.

మ‌రో వార్త‌లో.. ఖాకీల‌కు కాసులు కురిపిస్తున్న న‌కిలీ విత్త‌నాలు…

Get real time updates directly on you device, subscribe now.

You might also like