ఎమ్మెల్యే చెప్పిండు.. ఇక్క‌డే ఉంటా..

-ఏం చేస్తారో చేసుకోండంటూ బెదిరింపులు
-స‌స్పెండ్ అయినా గుడిలో పూజ‌లు
-ప‌ట్టించుకోని ఈవో, ఆల‌య క‌మిటీ
-పెండ్లిళ్ల‌కు మ‌ళ్లీ డ‌బ్బులు వ‌సూలు
-బుగ్గ రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవాల‌యం పూజారి ఇష్టారాజ్యం

Bugga Rajarajeshwara Swamy Temple:ఆయ‌న గుడిలో పూజారి.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్ర‌వ‌రిస్తాడు.. భ‌క్తుల‌ను, ఆల‌య సిబ్బందిని, చివ‌ర‌కు ఆల‌య క‌మిటీని సైతం దూషిస్తాడు. త‌న‌కు న‌చ్చిన‌ట్లు పెండ్లిండ్లు చేస్తాడు.. వారి వ‌ద్ద నుంచి డ‌బ్బులు వ‌సూలు చేస్తాడు. ఆయ‌న‌కు సంబంధం లేకున్నా స‌ర్టిఫికెట్లు జారీ చేస్తాడు. చివ‌ర‌కు ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసినా ఇది నా ఆల‌యం.. నాకు ఎమ్మెల్యే చెప్పిండు.. నేను ఇక్క‌డే ఉంటా.. ఏం చేస్తారో చేసుకోండంటూ పూజ‌లు చేస్తున్నాడు..

ఇదీ మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం శ్రీ బుగ్గ రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవాల‌యం పూజారి ఆర్‌.వేణుగోపాల్ ప్ర‌వ‌ర్త‌న‌. ఆయ‌న గ‌తంలో ఇక్క‌డ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆయ‌న మీద ఎన్నిసార్లు ఫిర్యాదులు వ‌చ్చినా ఇక్క‌డ ఈవో కానీ, ఆల‌య క‌మిటీ కానీ ప‌ట్టించుకోలేదు. భ‌క్తుల‌ను దూషించ‌డం, చివ‌ర‌కు ఆలయ సిబ్బంది, క‌మిటీ వారిపై కూడా ఇష్టారాజ్యంగా ప్ర‌వ‌ర్తించారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు పెండ్లిండ్లు సైతం చేశాడు. వారి వ‌ద్ద వేల‌కు వేలు వ‌సూళ్లు చేసి స‌ర్టిఫికెట్లు సైతం జారీ చేశాడు. కొన్ని సంద‌ర్భాల్లో మైన‌ర్ బాలిక‌ల‌కు సైతం పెండ్లిల్లు చేశాడ‌నే ఆరోప‌ణ‌లు సైతం ఉన్నాయి. ఇక స‌మ‌యం విష‌యంలో ఆయ‌న వ‌చ్చిందే టైం.. చేసిందే పూజ అన్న‌ట్లుగా ప్ర‌వ‌ర్తించాడు.

చివ‌ర‌కు విసిగి వేసారిన ఆల‌య క‌మిటీ స‌భ్యులు, అధికారులు చేసిన ఫిర్యాదు మేర‌కు దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ వేణుగోపాల్‌ను స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆయ‌న నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పెండ్లిండ్లు చేయ‌డం, డ‌బ్బుల వ‌సూళ్లు, స‌మ‌యానికి రాక‌పోవ‌డం, చూపుతూ ఆయ‌న‌ను అర్చ‌క విధుల నుంచి తొల‌గించారు. ఈ మేర‌కు దేవాదాయ శాఖ డిప్యూటీ క‌మిష‌న‌ర్ అత‌న్ని విధుల నుంచి తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే, ఆర్‌.వేణుగోపాల్ మాత్రం ఆ ఉత్త‌ర్వుల‌ను బేఖాత‌ర్ చేస్తున్నారు. ఆయ‌న య‌థావిధిగా పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.

త‌న‌కు బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య చెప్పార‌ని తాను ఇక్కేడ ఉంటాన‌ని అధికారుల‌కు సైతం చెబుతున్నాడు. త‌న‌ను ఎవ‌రూ ఏం చేయాలేరంటూ గుడిలో పూజ‌లు చేస్తుంట‌డం గ‌మ‌నార్హం. కొద్ది రోజుల కింద‌ట ఆయ‌న పెండ్లిండ్లు చూస్తు అధికంగా డ‌బ్బులు అడిగిన విష‌యాన్ని ఓ బాధితులు అక్క‌డ ఉన్న ఫిర్యాదుల పుస్త‌కంలో రాశారు. ఆల‌య ఈవో కానీ, క‌మిటీ స‌భ్యులు కానీ క‌నీసం ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. మ‌రి వీరి మౌనం వెన‌క అర్దం ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న పాపాల వెన‌క వీరి పాత్ర ఏమిట‌నే దానిపై భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా అటు ఉన్న‌తాధికారులు, ఆల‌య క‌మిటీ స‌భ్యులు, ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య ఈ వ్య‌వ‌హారంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like