రాష్ట్రవ్యాప్తంగా బ‌స్సులు బంద్‌

Buses bandh across the state:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో డిపోలు, బస్టాండ్ల వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆర్టీసీ బస్సులు తిరగకుండా నిలిపివేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల డిపోల‌కే బ‌స్సులు ప‌రిమితం అయ్యాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తిరిగే అన్ని బస్సులూ నిలిచిపోయాయి. విజయవాడలో తిరిగే సిటీ బస్సులు కదల్లేదు. ముందస్తు సమాచారం లేకుండా ఉన్నట్టుండి బస్సులను ఆపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పోలీసుల ఆదేశాలు, సూచనల మేరకే బస్సులు రాకపోకలపై నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.

విశాఖలో కూడా అదే పరిస్థితి కనిపించింది. ద్వారకానగర్‌ బస్ స్టేషన్‌లో ప్రయాణికులను కిందకు దించేసి బస్సులను డిపోలకు తరలించారు. టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు డబ్బులు వాపస్ ఇచ్చారు. రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులను వేచి ఉండాలని సూచిస్తున్నారు. దీంతో ఉదయాన్నే దూర ప్రాంతాలకు వెళ్లడానికి వచ్చిన వారంతా వెనుతిరిగారు. విశాఖలో సిటీ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. రాయలసీమలో కూడా ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు ఎక్కడకక్కడ నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి ఒక్క బస్సును కూడా పోలీసులు బయటికి పంపలేదు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు కదల్లేదు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like