నాడు కాసులు… నేడు క‌న్నీళ్లు..

Tomato: నిన్న‌టి వ‌ర‌కు సామాన్యుడికి క‌న్నీళ్లు తెప్పించిన ట‌మాట‌.. ఇప్పుడు రైతులకు కంట నీరు పెట్టిస్తోంది. రైతుల‌కు కాసుల వ‌ర్షం కురిపించిన అదే ట‌మాట ఇప్పుడు ప‌శువుల మేత‌గా ప‌నిచేస్తోంది. కనీసం రవాణా ఛార్జీలు రావడం కూడా గగనంగా మారడంతో రైతులు పంటను రోడ్డుపై పారబోస్తున్నారు. ట‌మాట ధ‌ర‌లు అయితే ఆకాశంలో లేదా పాతాళంలో అన్న‌ట్టుగా మారింది.

జూన్ రెండో వారం నుంచి టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగి.. సామాన్యులకు చుక్కలు చూపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 200 దాటింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో రూ. 250 నుంచి రూ.300 వరకు పలికిన సందర్భాలున్నాయి. ఆగస్టు రెండో వారం వరకు కొండెక్కి కూచోవడంతో టమోటాలవైపు కన్నెత్తి చూడటానికి జనం జడిసిపోయారు. కానీ, గత రెండు వారాల నుంచి టమాటా ధర నేల చూపులు చూస్తూ.. సీన్ పూర్తిగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకూ మార్కెట్‌లో రూ.200 పలికిన కిలో టమాటా.. నేడు ధరలు లేక వెలవెలబోతోంది. ధరలు భారీగా పతనమయ్యాయని, పంట కోత, రవాణా ఖర్చులు సైతం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

కొండెక్కిన టమాటా గిట్టుబాటు ధరలు లేక పారబోసే స్థాయికి చేరుకుంది. మార్కెట్‌లోకి భారీగా సరుకు పోటెత్తుతుండగా.. ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు రాక టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నెల కిందటి వరకూ క్వింటాళ్ల కొద్దీ టమాటాలు తీసుకొచ్చి.. సంచులతో డబ్బులు తీసుకెళ్లారు. కానీ, ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పెరిగిన టమాటా ధరలు రైతులకు కాసుల పంట కురిపించాయి. ఊహకందని ధరలతో ఏళ్లుగా వెంటాడిన దరిద్రం వదిలేసి రైతులు కోటీశ్వరలయ్యారు. ఇదే విషయాన్ని రైతులు స్వయంగా వెల్లడించారు. టమోటాకు ఇంత ధర ఎప్పుడూ లేదని, తమ కష్టాలన్నీ తొలగిపోయాయని తెలిపారు.

కానీ ఇప్పుడు క‌నీసం పంట‌కు ధ‌ర మాట అటుంచి కూలీ ఖ‌ర్చులు కూడా వెల్ల‌డం లేదు. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్‌లో కిలో టమాటా రూ. 3 పలికితే.. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో ధర భారీగా పతనమయ్యింది. 25 కిలోల టమాటా బాక్సు రూ.10 నుంచి రూ.35 వరకూ పలుకుతుండటం గమనార్హం. అంటే కేజీ టమాటా దాదాపు 30 నుంచి 40 పైసలే. దీంతో గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై టమాటాలను రైతులు పారబోస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like