గిన్నెధ‌రి 3.5

తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల ప్రజలు గజగజ వణుకుతున్నారు. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గిన్నెధ‌రిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ శీతాకాలంలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. వారం రోజుల వ్యవధిలో 9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గింది.

గాలుల వ‌ల్లే త‌గ్గుతున్న ఉష్ణోగ్ర‌త‌లు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. పెరిగిపోతున్న చలి తీవ్రత నుండి కాపాడుకునేందుకు ప్రజలు చలి మంటలు కూడా కాస్తూ ఉపశమనం పొందుతున్నారు. తూర్పు, ఈశాన్య దిక్కుల నుండి వీస్తున్న గాలులతోనే చలి తీవ్రత పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు పడిపోయాయి. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదవతున్నాయి.

ఏజెన్సీ ప్రాంతాల్లో జీవనంపై ప్రభావం..
ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో జనజీవనంపై ప్రభావం చూపుతుంది. పంట పొలాల్లో రైతులు పంటకు నీరివ్వడం, చెట్లు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో చలికి జనం అల్లాడిపోతున్నారు. చలి తీవ్రతకు వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే గాని భానుడు కనిపించడం లేదు. పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా ఉదయం, సాయంత్రం చలి మంటలు కాగుతూ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెల్లవారుజామున విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఉదయం పూట పనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతం. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

పంట‌ల‌పై ప్ర‌భావం..
చలి గాలులు పంట పొలాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పత్తిలో తేమ శాతం పెరిగిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏజేన్సీ ప్రాంతంలోని గ్రామాల చుట్టు అడవులు, కొండలు ఉండటంతో పొగమంచు కమ్ముకొని జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో బయటకు వెళ్ళకుండా ఇంటిపట్టునే ఉండిపోవాల్సిన పరిస్థితి. ఇంకా కొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉదయం పూట విధులు నిర్వర్తించే పారిశుద్ద్య కార్మికులు, పాలు సరఫరా చేసే వారు పెరిగిన చలితో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాకర్లు కూడా వణికిపోతున్నారు. పిల్లలు, వృద్దులు కూడా అవస్థలు పడుతున్నారు. ఉదయం పూట పాఠశాలలు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగ రీత్యా రాకపోకలు సాగించే ఉద్యోగులు కూడా చలితో అవస్థలు పడుతున్నారు.

 

 

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌లు

గిన్నెధ‌రి (కొమురంభీమ్) – 3.5
బేల (ఆదిలాబాద్‌) – 3.8
అర్లి టి (ఆదిలాబాద్) – 3.9
సిర్పూర్ (యూ), (కొమురంభీమ్) – 4.0
వాంకిడి (కొమురం భీమ్‌) – 5.0

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like