మామా… ద‌గ్గ‌రికొచ్చినం…

-జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్-3
-కేవలం 1,437 కి.మీ. దూరంలో వ్యోమనౌక

Chandrayaan-3:చందమామ‌పై ప్ర‌యోగాల కోసం ఇస్రో ప్ర‌యోగించిన చంద్ర‌యాన్-3 జాబిల్లికి మ‌రింత చేరువ‌గా వెళ్లింది. ఆ వ్యోమ‌నౌక‌ చంద్రుడికి కేవ‌లం 1,437 కి.మీ. దూరంలో ఉంది. కొద్దిరోజుల్లో చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి చంద్రుడికి మరింత చేరువయ్యే క్రమంలో కక్ష్య నిర్ధారణ ప్రక్రియ కీలకం కానుంది. 100 కిలోమీటర్ల వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత ప్రక్రియ చాలా సవాల్‌తో కూడుకున్నది.

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-3 ఒక్కో ద‌శ విజ‌య‌వంతంగా ముందుకు సాగుతోంది. ఈ వ్యోమ‌నౌకకు సంబంధించి బుధ‌వారం చేప‌ట్టిన ప్ర‌యోగంతో క‌క్ష్య 1,437 కి.మీ.కి తగ్గిందని ఇస్రో వెల్ల‌డించింది. మళ్లీ ఈ నెల 14న మ‌రోసారి క‌క్ష్య త‌గ్గింపు ప్ర‌యోగం చేప‌ట్ట‌నున్నారు. ఆ రోజు ఉద‌యం 11.30 నుంచి 12.30 గంటల మధ్య నిర్వహించే విన్యాసంతో జాబిల్లికి మరింత దగ్గరగా చేరనుంది. ఆగష్టు 16న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్.. దాని ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి విడిపోతుంది.

దీంతో అంతరిక్ష నౌక చంద్రుడికి మరింత దగ్గరవుతుంది. ఈ సమయంలో చంద్రుడికి దాదాపు 100 కి.మీ దూరంలో ఉంటుంది. ఆగష్టు 18న చంద్రయాన్-3 చివరి కక్ష్య సర్దుబాటును 30 కి.మీలకు తగ్గించడం ద్వారా చంద్రునికి అత్యంత సమీపంగా వెళ్లనుంది. అంతా సవ్యంగా జరిగితే ఆగస్టు 23న సాయంత్రం 5:47 గంటలకు ల్యాండింగ్‌ చేపట్టనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like