నిప్పులు చిమ్ముతూ నింగిలోకి..

Chandrayan 3: జాబిల్లిలోని రహస్య జాడలు కనుక్కునేందుకు ప్ర‌యోగించిన‌ చంద్రయన్‌ -3 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప కార్యం విజయవంతమయ్యింది. ఒకటి రెండూ కాదు.. నాలుగేళ్ళ ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి తొలిదశ విజయవంతంగా పూర్తయ్యింది. గురువారం మధ్యాహ్నం 1:05 నిముషాలకు చంద్రయాన్-3 (Chandrayan 3) కౌంట్‌డౌన్ ప్రారంభమవగా.. మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 జాబిలి మీదకు దూసుకెళ్లింది. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. ఈ మిషన్లో భాగంగా రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్లను జీఎస్ఎల్వీ మార్క్3 రాకెట్ తీసుకెళుతోంది. దీని బరువు దాదాపు 3,900 కిలోగ్రాములు.చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు.

రాకెట్ మొదటి దశను దాటి రెండో దశలోకి ప్రవేశించింది. రాకెట్ ప్రయోగాన్ని 3 దశల్లో నిర్వహిస్తున్నారు.. చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్‌ను ఎల్‌వీఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది. 40 రోజుల పాటు సుదీర్ఘ ప్రయాణం సాగనుంది. సుమారు 3.84 లక్షల కిలోమీటర్లు ప్రయాణించనుంది. భూకక్ష్యలో 24 రోజులపాటు భ్రమణం చెందుతుంది. ఆగస్టు 23, 24 తేదీల్లో జాబిల్లిపైకి ల్యాండర్ చేరుతుంది. ఆగస్ట్ 23 లేదా ఆగస్ట్ 24న చంద్రుడి దక్షిణ దృవం మీద మీద ల్యాండయ్యేలా ల్యాండర్‌ని ప్రయోగిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. లేక‌పోతే మరో నెల రోజుల తర్వాత ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తామని తెలిపారు.

అయితే చంద్రుడి దశలను బట్టి దాని మీద ల్యాండర్‌ను దింపాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి మీద దిగి పరిశోధనలు చేసే ల్యాండర్, రోవర్ మాడ్యూల్ పనిచేయడానికి పవర్ కావాలి. ఆ పవర్.. సోలార్ ప్లేట్ ల నుంచి మాత్రమే ల్యాండర్, రోవర్లు పొందగలుగుతాయి. అంటే ల్యాండర్ దిగే సమయానికి అక్కడ సూర్యరశ్మి ఉండాలి. అంటే చంద్రుడి మీద పగలు ప్రారంభమయ్యే సమయానికి ల్యాండింగ్ జరగాలి. భూమి మీద ఒక రోజుకి, చంద్రుడి మీద ఒక రోజుకు చాలా తేడా ఉంటుంది. చంద్రుడి మీద ఒక రోజు అంటే అది భూమి మీద దాదాపు 29 రోజులకు సమానం. అంటే చంద్రుడి మీద ఒక పగలు అంటే దాదాపు 14 రోజులు ఉంటుది. ఆ 14 రోజులు మాత్రమే అక్కడ సూర్యకాంతి లభిస్తుంది. అంటే ఆ 14 రోజులు మాత్రమే ల్యాండర్, రోవర్లకు కావాల్సిన సౌరశక్తి అందుతుంది. అందుకే చంద్రుడిపైకి పంపుతున్న ల్యాండర్, రోవర్ల జీవిత కాలం కేవలం 14 రోజులే అని ఇస్రో తెలిపింది.

చంద్రయాన్-3 మిషన్ కోసం అంచనా వేసిన బడ్జెట్ రూ.600 కోట్లు. అయితే దీన్ని కాస్త పెంచడంతో చివరి బడ్జెట్ రూ.615 కోట్లకు చేరింది. అయితే చంద్రయాన్-2తో పోలిస్తే ఈ బడ్జెట్ ఇప్పటికీ చాలా తక్కువ. ఎందుకంటే.. చంద్రయాన్-2 మిషన్ బడ్జెట్ దాదాపు 978 కోట్ల రూపాయలు. చంద్రయాన్-3 తక్కువ ధరకు ప్రధాన కారణం అది ఆర్బిటర్‌ను ఉపయోగించకపోవడమే. ఆర్బిటర్‌కు బదులుగా.. ప్రొపల్షన్ మాడ్యూల్ ఉపయోగించబడింది. ఆర్బిటర్‌తో పోలిస్తే దీని నిర్మాణానికి తక్కువ ఖర్చు అవసరం అవుతుంది. అందుకే ఈ ప్రచార బడ్జెట్ కూడా తగ్గింది.

కాగా, ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో 2019లో చంద్రయాన్-2 మిషన్‌ను చేపట్టింది. అయితే, చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ఆర్బిటర్ సాఫ్ట్ ల్యాండింగ్ విఫలమైంది. చంద్రుని చుట్టూ ప్రస్తుతం విజయవంతంగా పరిభ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2లోని లోపాలను సవరిస్తూ తాజాగా, ఇస్రో చంద్రయాన్-3 చేపట్టింది. కాగా,ఇప్పటి వరకు అమెరికా, రష్యా , చైనా దేశాలు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహకనౌకలను ల్యాండ్ చేయగలిగాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like