రాజీ ప‌డ‌తారా…? స‌మ్మెకు వెళ్తారా…?

కార్మిక సంఘాల‌తో యాజ‌మాన్యం చ‌ర్చ‌లు నేడు

సింగ‌రేణిలో కార్మిక సంఘాలు స‌మ్మెకు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో నేడు చ‌ర్చ‌ల‌కు రావాల‌ని యాజ‌మాన్యం కోరింది. కేంద్రం సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల నాయకులు సమ్మె చేసేందుకు యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 9 నుంచి 11 వరకు సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత నెల 25న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మె నోటీసు ఇవ్వగా 30న అన్ని జాతీయ కార్మిక సంఘాలతో కలిసి సమ్మె నోటీసు అందజేశారు. టీబీజీకేఎస్, బీఎంఎస్ స‌మ్మెకు సై అన‌డం గ‌మ‌నార్హం. ఐఎన్‌టీయూసీ,సీఐటీయూ,ఏఐటీయూసీ,హెచ్‌ఎంఎస్,ఐఎఫ్‌టీయూతో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా సమ్మెకు కదం తొక్కనున్నాయి.

చ‌ర్చ‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి ముందుకు…
ఈ రోజు నిర్వ‌హించ‌నున్న చ‌ర్చ‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కార్మిక సంఘాల ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. ఈ చ‌ర్చ‌ల్లో ప్ర‌ధాన డిమాండ్లు ఏవీ ప‌రిష్కారం అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో ఖ‌చ్చితంగా స‌మ్మె అనివార్యం అయ్యే ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి. యూనియ‌న్ల‌ను కూడా ఈ స‌మ్మెను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటుండంతో ఖ‌చ్చితంగా స‌మ్మెకు వెళ్తామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అన్ని సంఘాలు క‌లిసి ముందుకు వెళ్లాల‌ని కార్మిక సంఘాలు భావించ‌గా, తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం కాస్తా ముందుకు వెళ్లి ముందే స‌మ్మె నోటీసు అందించింది. దీంతో జాతీయ కార్మిక సంఘాలు తాము సైతం స‌మ్మెలోకి వెళ్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశాయి.

11 డిమాండ్లతో సమ్మె నోటీస్
దేశ వ్యాప్తంగా 88 బొగ్గు బ్లాక్‌‌లను కేంద్ర ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించగా, అందులో తెలంగాణలోని కల్యాణిఖని బ్లాక్‌‌ 6, కోయగూడెం బ్లాక్‌‌ 3, సత్తుపల్లి బ్లాక్‌‌ 3, శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌‌లున్నాయి. ఈ బ్లాక్‌‌లను వేలం వేసి ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తే భవిష్యత్‌‌లో సింగరేణి మనుగడ ప్రమాదంలో పడుతుంద‌ని, కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని స్ప‌ష్టం చేస్తున్నారు. కోల్‌‌ బ్లాక్స్‌‌ వేలంను రద్దు చేయాలని, ఓపెన్‌‌ కాస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌లు, భూగర్భ గనుల్లో కాంట్రాక్టు కార్మికులతో బొగ్గు వెలికితీత పనులు చేయించొద్దని, గని ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు వచ్చే బెనిఫిట్స్‌‌ కాకుండా అదనంగా రూ.కోటి స్పెషల్‌‌ ఎక్స్‌‌గ్రేషియా ప్రకటించాలనే తదితర 11 డిమాండ్లను చేర్చారు.

సమ్మెతో ఉత్ప‌త్తిపై ప్ర‌భావం
2011, ఆగస్టు‌లో ఏఐటీయూసీ స‌మ్మె చేసింది. తర్వాత తెలంగాణ ఉద్యమం, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై ఇక్కడి సంఘాలు మద్దతుగా సమ్మె చేపట్టాయి. కొన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటే మరికొన్ని సంఘాలు సమ్మె విచ్ఛిన్నం చేసేవి. కానీ చాలా ఏండ్ల తర్వాత సింగరేణి సమస్యలపై గుర్తింపు, జాతీయ కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. వారిచ్చిన సమ్మె పిలుపుతో సింగరేణిలో 3 రోజుల పాటు కార్మికులు డ్యూటీలకు హాజరుకాకుండా చూడాలని కార్యాచరణ రూపొందించారు. మూడు రోజులు సమ్మె జరిగితే సింగరేణి వ్యాప్తంగా 25 అండర్‌‌ గ్రౌండ్‌‌ మైన్స్‌‌, 11 ఓపెన్‌‌ కాస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌లలో సుమారుగా రెండు లక్షల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like