ఇక బాదుడే.. బాదుడు…

పెర‌గ‌నున్న క‌రంటు చార్జీలు, ఇటు బ‌స్సు టిక్కెట్ ధ‌ర‌లు - క‌రంట్ యూనిట్‌కు రూ. 1 పెంచేందుకు రంగం సిద్ధం - బ‌స్సుల చార్జీల‌పై సైతం క‌స‌ర‌త్తు పూర్తి - నేడో, రేపో ప్ర‌క‌టించ‌నున్న ప్ర‌భుత్వం

తెలంగాణ ప్ర‌భుత్వం అటు విద్యుత్ చార్జీలు, బ‌స్సుల చార్జీలు సైతం పెంచేందుకు రంగం సిద్ధమ‌య్యింది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు పూర్తి చేసిన అధికారులు ముఖ్య‌మంత్రికి ప్ర‌తిపాద‌న‌లు పంపించారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో పూర్తి స్ప‌ష్ట‌త రానుంది.

విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌య్యింది. ఐదేళ్లుగా ఒక్కపైసా కూడా ఛార్జీలు పెంచనందున నష్టాలు, ఆర్థికలోటు పెరిగిపోయాయని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యూనిట్‌కు సగటున రూపాయి చొప్పున ఛార్జీలు పెంచితే తప్ప ఆర్థిక కష్టాలు తీరవని డిస్కంలు భావిస్తున్నాయి. అదే అంశాన్ని అధికారులు ప్ర‌భుత్వం ముందుంచారు.

అంత పెద్ద మొత్తంలో పెంచితే ఎలా అని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. యూనిట్‌కు 5-10 పైసలు పెంచితే ఆర్థిక కష్టాలు ఇప్పట్లో తీరవని, సుదీర్ఘ కాలం తర్వాత ఛార్జీలు పెంచుతున్నందున ఆర్థికంగా చేయూతనిచ్చేలా పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డిస్కంలు భావిస్తున్నాయి. ప్రస్తుత, వచ్చే ఏడాది కలిపి రూ.21,552 కోట్ల మేర ఆర్థికలోటు ఉంటుందని డిస్కంలు ప్రభుత్వానికి, ఈఆర్‌సీకి తెలిపాయి. వీటితో పాటు ఏటా రూ.6 వేల కోట్ల నష్టాలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా సగటున 4 వేల కోట్ల యూనిట్ల విద్యుత్‌ను డిస్కంలు ప్రజలకు విక్రయిస్తున్నాయి. యూనిట్‌కు సగటున రూపాయి చొప్పున పెంచితే ఏటా రూ.4 వేల కోట్ల ఆదాయం అదనంగా వస్తుంది. ప్రస్తుత ఛార్జీలను కొనసాగిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం(2022-23) రూ.10,928 కోట్లు లోటు ఉంటుంది. యూనిట్‌కు రూపాయి చొప్పున ఛార్జీలు పెంచినా రూ.6,928 కోట్లు లోటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

ఛార్జీల పెంపును భారంగా భావించకుండా యూనిట్‌కు కనీసం రూపాయి చొప్పున పెంచేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆమోదం పొందాక విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి ఇవ్వాలని డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు ఛార్జీల పెంపు ప్రతిపాదనలు వారం రోజుల్లో అందజేయాలని రాష్ట్ర డిస్కంలకు ఆదేశాలు అందాయి. ఈ పెరగనున్న చార్జీలను వచ్చే సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి రానున్నట్లు కూడా తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కరెంట్‌ చార్జీల సవరణకు వీలుగా పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు కరెంట్ చార్జీలు పెంచితే కనుక అన్ని రకాల క్యాటగిరీలో పెంచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారట అధికారులు.

మ‌రోవైపు ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో 2019లో చార్జీలు పెరిగాయి. పెరిగిపోతున్నఅప్పులు, ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలను మరోసారి పెంచాలని నిర్ణయించారు. పెరుగుతున్న ఇంధన ధరల అంచనా వేస్తూ బస్సు చార్జీలను పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు పెంపు ప్రతిపాదనలు చేశారు. 2019 డిసెంబర్‌లో ప్రతీ కిలోమీటర్‌కు సగటున 20 పైసల చొప్పున పెంచారు. దీంతో ఏటా రూ.550 కోట్లు అదనంగా ఆదాయం రాగా ఆ మేర ప్రజలపై భారం పడింది. అప్పుడు డీజిల్ ధర లీటర్‌కు రూ. 68 ఉండగా.. ప్రస్తుతం రూ.94కు చేరింది. ఇటీవల కేంద్రం సుంకం తగ్గించడంతో ఆర్టీసీ రాయితీ ధర కలుపుకొని రూ.90గా ఉంది.

ఈ క్రమంలోనే చార్జీల పెంపుపై అధికారులు పలు ప్రతిపాదనలు చేశారు. అందులో ఒకదానిపై మంత్రి, అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పల్లె వెలుగుకు కి.మీ.కు 25 పైసలు.. ఎక్స్‌ప్రెస్‌, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30 పైసలు.. సిటీ ఆర్డినరీ సర్వీసులకు కి.మీ.కు 25 పైసలు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30 పైసలు పెంచాలని ప్రతిపాదించారు. దీన్ని సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపినట్లు సమాచారం. సీఎం ఆమోదించిన వెంటనే అమలు చేయనున్నారు. కాగా, పెరిగే చార్జీలతో ఆర్టీసీకి ప్రతీ ఏటా రూ.900 కోట్ల ఆదాయం రానుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like