రేపు మూడు జిల్లాల్లో ముఖ్య‌మంత్రి పర్యటన..

పంటలను పరిశీలించనున్న కేసీఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో భారీగా పంటనష్టం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే మంత్రులు సైతం పంట నష్టాన్ని పరిశీలించారు. ముఖ్య‌మంత్రి సైతం ఈ మూడు జిల్లాల్లో ప‌ర్య‌టించి క్షేత్ర‌స్థాయిలో వివ‌రాలు తెలుసుకుంటారు.

గురువారం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని గీసుకొండ, దుగ్గొండితో పాటు పలు మండలాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. రోడ్డుమార్గంలో గిర్నిబావి, కొమ్మాల, పల్లారుగూడ, వంజరపల్లిలో పంటలను పరిశీలించనున్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.

ఇక క‌రీంన‌గ‌ర్ జిల్లా రామ‌డుగు మండ‌లం చిప్ప‌కుర్తి, ధ‌ర్మాజీపేట‌, ల‌క్ష్మీపూర్ గ్రామాల్లో తీవ్ర పంట న‌ష్టం సంభ‌వించింది. వ‌రి, మామిడి, మొక్క‌జొన్న‌, ట‌మాట త‌దిత‌ర పంట‌లు వేసిన రైతులకు క‌డ‌గండ్లే మిగ‌లాయి. మొక్క‌జొన్ని నెల‌కొరిగి క‌నీసం యంత్రాల‌తో సైతం కోయ‌లేని దుస్థితి. ఈ నేప‌థ్యంలో దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించేందుకు ముఖ్య‌మంత్రి జిల్లాకు రానున్నారు.

ఖ‌మ్మం జిల్లా బోన‌క‌ల్లులో దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిశీలిస్తారు. మొదట‌గా ఆయ‌న హైద‌రాబాద్ నుంచి నేరుగా ఖ‌మ్మం చేరుకుంటారు. అక్క‌డ బోన‌క‌ల్లులో పంట‌ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హిస్తారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న దృష్ట్యా ప్ర‌త్యేక హెలిపాడ్ తో పాటు రైతు వేదిక‌లో స‌మావేశం నిర్వ‌హించే ప్రాంతాన్ని క‌లెక్ట‌ర్‌, ఎస్పీ ప‌రిశీలించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like