కోల్‌బెల్ట్‌లో హ్యాష్ ఆయిల్ జోరు

-మెల్లిమెల్లిగా విస్త‌రిస్తున్న గంజాయి ర‌వాణా
-వైజాగ్‌,అర‌కు నుంచి ఇక్క‌డికి స‌ర‌ఫ‌రా
-హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్న అబ్కారీ పోలీసులు
-ఐదుగురి అరెస్ట్

పోలీసుల నిఘా పెర‌గంతో గంజాయి స్మ‌గ్ల‌ర్లు సైతం కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. గంజాయి నేరుగా ర‌వాణా చేస్తే దొరికిపోతున్నామ‌ని ఆలోచించి త‌మ రూటు మార్చారు.

గంజాయి మ‌త్తు కోల్‌బెల్ట్ ప్రాంతానికి సైతం విస్త‌రిస్తోంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో జరుగుతున్న సంఘటనలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అదే క్రమంలో ఎక్క‌డో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. గంజాయి నుంచి తీసిన (హ్యాష్ ఆయిల్‌) ద్రావణం పెద్దపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున చేతులు మారుతోంది. అధిక శాతం యువత గంజాయి మత్తులో భవిష్యత్తు నిర్వీర్యం చేసుకుంటున్నారు. పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నా ఏదో మూలన గంజాయి అక్రమ రవాణా సాగుతోంది.

ఇదే క్రమంలో గంజాయి నుంచి తీసిన ద్రావణాన్ని (హ్యాష్ ఆయిల్‌) సరఫరా చేస్తున్న ఐదుగురు యువకులను గోదావరిఖని ఆబ్కారీ శాఖ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 9 లక్షల విలువ చేసే 900 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని స్వాధీనం చేసుకున్నారు. రామగుండం విద్యుత్ నగర్ కు చెందిన వినీత్, శశి, నరసింహాచారి, మహేష్ లతో పాటు వైజాగ్ అరకు ప్రాంతానికి చెందిన ఒకరు రెండువేల మిల్లీ లీటర్ల ద్రావణాన్ని తీసుకువచ్చారని వెల్ల‌డించారు. చిన్న చిన్న బాటిళ్లలో నింపి రూ. 2 వేల చొప్పున విక్రయిన్నారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ మేరకు గోదావరిఖని ఎక్సైజ్ శాఖ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రమేష్ వివరాలను వెల్లడించారు… వారి నుంచి 900 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి నుంచి తీసిన ఈ ద్రావణాన్ని సిగరెట్ లో కలుపుకుని హుక్కా లా పీల్చుతారని పోలీసులు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like