కోలిండియా స్థాయి పోటీల్లో సింగ‌రేణి సత్తా

పవర్‌ లిఫ్టింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాడీ బిల్డింగ్‌ పోటీల్లో 14 పతకాలు కైవసం

మంచిర్యాల : కోలిండియా స్థాయిలో జరిగిన ఇంటర్‌ కంపెనీ పోటీల్లో సింగరేణి క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. పవర్‌లిఫ్టింగ్‌,వెయిట్‌ లిఫ్టింగ్‌,బాడీబిల్డింగ్‌ పోటీల్లో వివిధ కేటగిరీల్లో తలపడిన 29 మంది సింగరేణి క్రీడాకారులు 14 పతకాలు సాధించారు. నాలుగు స్వర్ణ పతకాలు, నాలుగు రజత పతకాలు, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి.

ఈ నెల 25 నుంచి కోల్‌కత్తాలోని కోలిండియా ప్రధాన కార్యాలయంలోని ఇండోర్‌ క్రీడా ప్రాంగణంలో మూడు విభాగాల్లో పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో కోలిండియాకు చెందిన 10 అనుబంధ సంస్థలతో పాటు సింగరేణి నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సింగరేణి క్రీడాకారులకు పవర్‌ లిఫ్టింగ్లో నాలుగు పతకాలు, వెయిట్‌ లిఫ్టింగ్‌ లో ఐదు పతకాలు, బాడీ బిల్డింగ్‌ లో ఐదు పతకాలు లభించాయి.

మొత్తం 11 కంపెనీలు పాల్గొన్న ఈ పోటీలో 14 పతకాలు సాధించడం ద్వారా పతకాల పట్టికలో సింగరేణి మూడో స్థానంలో నిలవడం విశేషం. బుధవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఒలింపిక్‌ పతక విజేత, ప్రముఖ వెయిట్‌ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులందరినీ అభినందించారు. ఉద్యోగుల్లోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారికి చివరి రోజున కోలిండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(కో ఆర్డినేషన్‌) మనోజ్‌ కుమార్‌ సింగ్‌ బహుమతులు ప్రదానం చేశారు.

సింగరేణి సంస్థలో ఉద్యోగుల్లోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రతీ ఏటా బడ్జెట్‌ ను కేటాయిస్తూ ప్రోత్సహిస్తున్న సింగరేణి యాజమాన్యానికి స్పోర్ట్స్‌ మేనేజర్ గట్టు స్వామి, కంపెనీ పరిశీలకుడు సుశీల్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. కోలిండియా స్థాయి క్రీడాకారుల నుంచి ఎదురైన గట్టి పోటీని తట్టుకొని మన వాళ్లు అద్భుత ప్రతిభను కనబరిచారన్నారు. ఈ సందర్భంగా కోలిండియా స్థాయి పోటీలకు తమను పంపించి ప్రోత్సహించిన యాజమాన్యానికి క్రీడాకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పతకాలు సాధించిన క్రీడాకారులు వీరే..

పవర్‌ లిప్టింగ్‌ కేటిగిరీలో : 66 కేజీల విభాగంలో కే.ఆనందరావు (ఆర్‌జి 2) బంగారు పతకం, 93 కేజీల విభాగంలో జి.రాజయ్య (ఆర్‌జి 2) రజత పతకం, 105 కేజీల విభాగంలో ఎస్‌.శ్రీనివాస్‌ రెడ్డి, (భూపాలపల్లి) కాంస్య పతకం, 120 కేజీల విభాగంలో బి.తిరుపతి (భూపాలపల్లి) బంగారు పతకం సాధించారు.

వెయిట్‌ లిఫ్టింగ్‌ కేటగిరీలో : 55 కేజీల విభాగంలో ఎం.యు.భాస్కరాచారి (బెల్లంపల్లి) రజత పతకం, 67 కేజీల విభాగంలో కె.అనిల్‌ కుమార్‌ (మణుగూరు) బంగారు పతకం, 81 కేజీల విభాగంలో పి.ప్రకాష్‌ (భూపాలపల్లి) రజత పతకం, 96 కేజీల విభాగంలో ఎ.సత్తయ్య (మందమర్రి) కాంస్య పతకం, 102 కేజీల విభాగంలో ఎ.మనోహర్‌ (మందమర్రి) కాంస్య పతకాలు సాధించారు.

బాడీ బిల్డింగ్‌ కేటగిరీలో : 60 కేజీల విభాగంలో కె.సమ్మయ్య (శ్రీరాంపూర్‌) రజత పతకం, 75 కేజీల విభాగంలో జె.మోజిలీ (మందమర్రి) కాంస్య పతకం, 80 కేజీల విభాగంలో ఎం.రామక్రిష్ణ (కొత్తగూడెం) కాంస్య పతకం, 85 కేజీల విభాగంలో జి.సత్యనారాయణ (ఆర్‌జి 2) బంగారు పతకం, 90 కేజీల విభాగంలో వెంకటస్వామి (బెల్లంపల్లి) రజత పతకాలు సాధించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like