క‌లెక్ట‌ర్‌పై జాతీయ ఎస్టీ క‌మిష‌న్ ఆగ్ర‌హం

ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ సిక్తా పట్నాయ‌క్‌పై జాతీయ ఎస్టీ క‌మిష‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఫ్యాక్ట‌రీ పేరుతో ఎస్టీల భూముల‌ను లాక్కోవ‌డం ఏమిటని ప్ర‌శ్నించింది. ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయ‌క‌పోగా, బాధితుల భూమి ఎందుకు వెన‌క్కి ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నించింది. దీనిపై మీరేం చేస్తున్నార‌ని క‌లెక్ట‌ర్‌పై సీరియ‌స్ అయ్యింది. వివ‌రాల్లోకి వెళితే… 2018 యాప‌ల్‌గూడ‌, రాంపూర్ గ్రామాల్లో రేణుకా సిమెంట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌కటించింది. స్థానికుల‌కు ఇక్క‌డ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సిమెంట్ ఫ్యాక్టరీ కోసం యాజ‌మాన్యం భూమిని సేకరించింది. అయితే నాలుగేండ్లు గ‌డుస్తున్న ఆ యాజ‌మాన్యం అటు ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయ‌లేదు… ఇటు భూమిని వెన‌క్కి ఇవ్వ‌లేదు. దీంతో త‌మ భూమిని వెన‌క్కి తిరిగి ఇవ్వాల‌ని ఎస్టీలు ఎన్నో రోజులుగా ఆందోళ‌న చేస్తున్నారు.

అయినా, వారి గోడు వినే నాథుడే లేకుండా పోయాడు. భూమిని కోల్పోయిన వారి కోసం న్యాయపోరాటం చేసేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ లో జిల్లా మాజీ ఛైర్మన్ సుహాసిని రెడ్డి పిటిషన్ వేశారు. దీంతో బుధ‌వారం జాతీయ ఎస్టీ క‌మిష‌న్ ఈ భూ నిర్వాసితుల కేసు విచారించింది. ఈ వ్య‌వ‌హారంలో క‌లెక్ట‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎస్టీల భూమి సేకరిస్తుంటే కలెక్టర్ ఏం చేశారంటూ జాతీయ ఎస్టీ కమిషన్ ప్ర‌శ్నించింది. 107 ఎకరాల భూమిని తిరిగి భూ నిర్వాసితులకు ఎందుకు ఇవ్వకూడదో వివరణ ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించింది. ఆ భూమి ఇప్పించిన ఎమ్మెల్యే జోగు రామన్న, ఆర్డీఓ సూర్యనారాయణ పై ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు పెట్టకూడదో వివరణ ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ ప్ర‌శ్నించింది. తదుపరి విచారణ ఓ నెల పాటు వాయిదా వేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like