నాకో టిక్కెట్ కావాలి…

=బెల్లంప‌ల్లి టిక్కెట్ కోసం నేత‌లు, ఉద్యోగుల పోటాపోటీ
=త‌మ‌కు ద‌గ్గ‌రి నేత‌ల ద్వారా ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు ఆశావ‌హులు
=తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న న‌లుగురు
=వారిలో ఎవ‌రికైనా ఇస్తారా..? సిట్టింగ్ వైపే మొగ్గు చూపుతారా..?
=ఆస‌క్తిక‌రంగా మారిన బెల్లంప‌ల్లి రాజ‌కీయం

BRS Party: ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. అదే స‌మ‌యంలో నేత‌లు ఇప్ప‌టి నుంచే ఎల‌క్ష‌న్స్ కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. సిట్టింగ్‌లు త‌మ స్థానాన్ని కాపాడుకోవ‌డానికి ప్ర‌జ‌ల్లో తిరుగుతుంటే ఆ టిక్కెట్టు ఆశిస్తున్న నేత‌లు త‌మ‌కు ద‌గ్గ‌రి నేతల ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నారు. టిక్కెట్టు కోసం పెద్ద ఎత్తున పోటీ నెల‌కొన‌డంతో ఇటు సిట్టింగ్‌ల్లో గుబులు మొద‌లైంది. మ‌రోవైపు ఒక్కో స్థానానికి ఒకే పార్టీ నుంచి న‌లుగురి నుంచి ఐదుగురు వ‌ర‌కు టిక్కెట్టు ఆశిస్తున్నారు.

టిక్కెట్ల కోసం ఇప్ప‌టి నుంచే పెద్ద ఎత్తున పోటీ సాగుతోంది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ లో టిక్కెట్ల కోసం పోటీ ఎక్కువ‌గా ఉంది. మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి టిక్కెట్టు కోసం న‌లుగురు పోటీ ప‌డుతున్నారంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక్క‌డ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్‌దే. రెండుసార్లు ఆ పార్టీ త‌ర‌ఫున దుర్గం చిన్న‌య్య గెలుపొందారు. ఈసారి ఎలాగైనా టిక్కెట్టు ద‌క్కించుకోవాల‌ని ప‌లువురు నేత‌లు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌మ‌కు సంబంధించిన నేత‌ల ద్వారా ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. తాము గ‌తంలో చేసిన ప‌నులు, పార్టీకి చేసిన సేవ‌లు చెప్పుకుంటూ అదే సమ‌యంలో అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల్లో ఎంత ఖ‌ర్చు చేయ‌గ‌ల‌మో కూడా చెబుతూ టిక్కెట్టు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ టిక్కెట్టు కోసం పోటీలో ఉన్న వారిలో నేత‌ల‌తో పాటు ఉద్యోగులు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

బెల్లంప‌ల్లి టిక్కెట్టు ఆశిస్తున్న వారిలో ఐటిడిఏ ఇంజనీర్ ఇన్ చీఫ్ ముడిమ‌డుగుల‌ శంకర్ ఉన్నారు. ఆయ‌నకు మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, సీఎంవోలో చ‌క్రం తిప్పుతున్న అధికారి రాజ‌శేఖ‌ర్ రెడ్డి అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి. వీరి ద్వారా ఆయ‌న పూర్తి స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో టిక్కెట్టు త‌న‌కే ద‌క్కేలా ఆయ‌న వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. గ‌తంలో ఉట్నూరు, భ‌ద్రాచ‌లం, ములుగు ఐటీడీఏ ప్రాంతాల‌కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, నేత‌ల‌తో ఆయ‌న‌కు మంచి రిలేష‌న్షిప్ ఉంది. నేత‌కాని సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న చాలా ఉన్న‌త‌స్థానంలో ఉన్నారు. కాబ‌ట్టి త‌న‌కు ఉన్న ప‌రిచ‌యాల ద్వారా ఆయ‌న టిక్కెట్టు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆయ‌న‌కు చాలా మంది నేతలు మ‌ద్ద‌తు చెబుతున్నారు.

పోలీసు సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు బోర్ల‌కుంట పోశ‌లింగం సైతం ఇక్క‌డ టిక్కెట్టు ఆశిస్తున్నారు. గ‌తంలో తెలుగుదేశం హ‌యాంలో ఆయ‌న టిక్కెట్టు కోసం ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టిక్కెట్టు ఆశిస్తున్న ఆయ‌న మంత్రి జగదీశ్వర్ రెడ్డి ద్వారా ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అదే స‌మ‌యంలో పైన త‌న‌కు తెలిసిన పోలీసు అధికారుల నుంచి సైతం టిక్కెట్టు కోసం చెప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం పెద్ద‌ప‌ల్లి ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత ఇప్పుడు ఎమ్మెల్యేగా బ‌రిలో దిగే అవ‌కాశాలు సైతం లేక‌పోలేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే జ‌రిగితే ఆయ‌న సామాజిక వ‌ర్గ రీత్యా బెల్లంప‌ల్లి నుంచి పోటీ చేస్తార‌ని అధిష్టానం ఈ విష‌యాన్ని పూర్తి స్థాయిలో ప‌రిశీలిస్తోంద‌ని స‌మాచారం.

ఇక మొద‌టి నుంచి ఇక్క‌డ నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న వారిలో ప్ర‌స్తుత గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రేణికుంట్ల ప్ర‌వీణ్ ఉన్నారు. మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈయ‌న సుమ‌న్ అనుచ‌రుల్లో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్నారు. రెండుసార్లు టిక్కెట్టు ఆశించి భంగ‌ప‌డ్డారు. ఈసారైనా త‌మ‌కు టిక్కెట్టు వ‌స్తుంద‌ని ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో ముందుడి ప‌నిచేసిన త‌న‌ను ఇప్ప‌టికైనా గుర్తిస్తార‌ని ప్ర‌వీణ్ భావిస్తున్నారు. కొద్దిరోజుల కింద‌ట ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ జ‌క్కుల శ్వేత సైతం ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న ప్ర‌చారం వినిపించింది. అయితే, త‌మ‌కు ఎమ్మెల్యే రాజ‌కీయ గురువు అని తాము అలాంటి ప్ర‌య‌త్నాలు ఏవీ చేయ‌లేద‌ని శ్వేత ప్ర‌క‌టించారు.

ఇలా న‌లుగురు వ్య‌క్తులు త‌మకు టిక్కెట్టు కావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్యకు సంబంధించి ఆరిజ‌న్ వ్య‌వ‌హారం పెద్ద ఎత్తున ఇబ్బందుల‌కు గురి చేసింద‌ని టిక్కెట్టు త‌మ‌కే వ‌స్తుంద‌ని వీరంతా భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి సైతం ఎమ్మెల్యేకు ప్ర‌తికూలంగా మారింద‌ని, ఖ‌చ్చితంగా సిట్టింగ్ స్థానం మారుస్తార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు టిక్కెట్టు ఖాయ‌మ‌ని ఆశావ‌హులు స్ప‌ష్టం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో సిట్టింగ్ అయిన త‌న‌కే టిక్కెట్టు వ‌స్తుంద‌ని అటు దుర్గం చిన్న‌య్య సైతం అంతే ధీమాతో ముందుకు వెళ్తున్నారు. ప్ర‌జ‌ల్లో తిరిగేందుకు పూర్తి స్థాయిలో త‌మ స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నారు. మ‌రి అధిష్టానం చివ‌ర‌కు ఎటు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like