సార్.. కింగ్‌ఫిష‌ర్ బీర్లు అమ్మ‌డం లేదు..

-వైన్స్‌ల్లో ఆ బీర్లు ఉంచ‌డం లేద‌ని క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు

జ‌గిత్యాల‌లో కింగ్‌ఫిష‌ర్ బీర్లు అందుబాటులో ఉండ‌టం లేద‌ని ఓ వ్య‌క్తి ఏకంగా క‌లెక్ట‌ర్‌కే ఫిర్యాదు చేశారు. దీంతో ఆ స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తామ‌ని అద‌న‌పు క‌లెక్ట‌ర్ హామీ సైతం ఇచ్చారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో కింగ్ ఫిష‌ర్ బీర్లు అమ్మ‌డం లేద‌ని బీరం రాజేష్ అనే వ్య‌క్తి క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. జగిత్యాల వైన్స్‌లో వాటిని అందుబాటులో ఉంచ‌డం లేద‌న్నారు. ఈ మేర‌కు సోమ‌వారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు.

ఈ సందర్బంగా బీరం రాజేష్ మాట్లాడుతూ జిల్లాలోని కోరుట్ల, ధర్మపురిలలో అన్ని రకాల బ్రాండ్ బీర్లు అమ్ముతుంటే జగిత్యాలలో మాత్రం వైన్స్ నిర్వాహ‌కులు సిండికేట్‌గా మారార‌ని ఆరోపించారు. జ‌నాల‌కు నాసిరకం బీర్లు అంటగడుతున్నారని ఆరోపించాడు. ఇవి తాగిన ప్రజలు యూరిక్ ఆసిడ్ వంటి రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఊరూరా బెల్ట్ షాపులు వెలిసి వాటి ద్వారా నకిలీ మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించాడు. స్పందించిన అదనపు కలెక్టర్ బి ఎస్ లత ఎక్సైజ్ సూరింటెండెంట్ తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించినట్టు వివరించాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like