ఎంసీసీ ఆస్తులు జ‌ప్తు

MCC: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సిమెంట్ కర్మాగారం ఆస్తులు, సిమెంట్ తయారీ ప్లాంట్‌ను నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ బుధవారం జ‌ప్తు చేసింది. 2019 సంవత్సరం నుంచి విద్యుత్ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో టీఎస్ ఎన్పీడీసీఎల్ సంస్థ పలుమార్లు మంచిర్యాల సిమెంట్ కంపెనీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఐదు కోట్ల రూపాయల బకాయిలు పది వాయిదాలలో చెల్లిస్తామని న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం 10 కోట్ల 36 లక్షల రూపాయల బకాయిల కోసం సిమెంట్ కర్మాగారంలోని యంత్రాలు, పరికరాలను విద్యుత్ శాఖకు అటాచ్ చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు స్ప‌ష్టం చేశారు మంచిర్యాల సిమెంట్ కర్మాగారనికి తాళాలు వేసి సీజ్‌ చేశారు.

కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాల మేరకు సిమెంట్ ప్లాంట్ యంత్రాలు, భవనాలు, సిమెంట్ తయారీదారునికి చెందిన 184 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శేషారావు తెలిపారు. మంచిర్యాల సిమెంట్ కంపెనీ 2019లో నష్టాలను పేర్కొంటూ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇక్క‌డ ప‌నిచేస్తున్న‌ 100 మంది ఉద్యోగులను సైతం తొలగించింది.

ఇది దక్షిణ భారతదేశంలోని పురాతన సిమెంట్ తయారీదారులలో ఒకటి. దీనిని 1958లో జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి, రోజుకు 1,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో స్థాపించారు. హైదరాబాద్-నాగ్‌పూర్ హైవేకి ఆనుకుని 350 ఎకరాల విస్తీర్ణంలో ఎంసీసీ కంపెనీ ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like