కాంగ్రెస్ చీలిపోనుందా…

-ముందే భేటీ పెట్టుకున్న అసంతృప్త నేత‌లు
-గాంధీ కుటుంబం రాజీనామా చేయాల‌ని డిమాండ్
-కొత్త పార్టీ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఆజాద్‌..?
-ఈ రోజు కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం

వ‌రుస ఓట‌ముల‌తో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున అంత‌ర్మ‌థ‌నం సాగుతోంది. అంత‌ర్మ‌థ‌నంతో పాటు అంత‌ర్యుద్ధం కూడా జ‌రుగుతోంది. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా ఓటమి ఎదుర‌వుతుండ‌టంతో సొంత పార్టీలోనే అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది. ఇప్ప‌టికే సీనియ‌ర్ నేత‌లు జీ 23 పేరుతో ముందుకు సాగుతున్న నేత‌లు గాంధీ కుటుంబం మొత్తం రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. లేక‌పోతే త‌మ దారి తాము వెతుక్కునే ప‌నిలో ఉన్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

జీ-23 నేత‌ల ప్ర‌త్యేక స‌మావేశం..
అయిదు రాష్ట్రాల ఫలితాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాల‌ ప్ర‌భావం కాంగ్రెస్ పార్టీపై గ‌ట్టిగానే ప‌డింది. అసమర్థ నాయకత్వమే పార్టీ పరాజయానికి కారణమంటూ సొంత పార్టీ నేతలే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ లో అధికారంలో ఉండి కూడా ఎన్నికల్లో ఓడిపోవడం ప‌ట్ల పార్టీలోని సీనియ‌ర్ నేత‌ల్లో ఆగ్ర‌హానికి కార‌ణం అవుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత నాయకత్వ మార్పును కోరుకుంటున్న 23 మంది సీనియర్ నేతలు మరోసారి హైకమాండ్ పై మండిపడ్డారు. జీ-23 బృందంగా మారిన ఈ నాయకులు శుక్రవారం గులామ్ నబీ ఆజాద్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ నేతల సమావేశం చాలా కీల‌కంగా మారింది. ఈ స‌మావేశంలో పార్టీ ఎంపీలు ఆనంద్ శర్మ, కపిల్ సిబాల్, మనీశ్ తివారీ తదితర నేతలు పాల్గొన్నారు. తమ భవిష్యత్ వ్యూహంపై వీళ్లు చర్చించినట్లు సమాచారం. పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే సమయం వచ్చిందని స్పష్టం చేశారు.

పార్టీ చీలిక త‌ప్ప‌దా…?
సోనియా గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించే కంటే ముందు ఈ జీ-23 నేతలు భేటీ కావడం కలకలం రేపుతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే పార్టీలో చీలిక వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీనియర్ నేతలందరితో పాటు తమతో కలిసి వచ్చే నాయకులతో కలిపి గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనతో పాటు ఈ సీనియర్ నేతలు అధిష్టానంతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో చీలిక తప్పదేమో అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రోవైపు ముగ్గురు గాంధీలు రాజీనామా చేసి కొత్త నాయ‌క‌త్వంలో ముందుకు వెళ్లాల‌ని ప‌లువురు భావిస్తున్నారు.

ఈ స‌మావేశ‌మే అత్యంత కీల‌కం..
సీనియ‌ర్ నేత‌లు అధిష్టానం అన్న రీతిలో సాగుతున్న పోరుకు చెక్ పెట్టేందుకు సోనియాగాంధీ ఏం ఆలోచిస్తున్నార‌నేది నేడు తేలిపోనుంది. ఆదివారం సీడబ్ల్యూసీ అత్య‌వ‌స‌ర స‌మావేశంలో నిర్వ‌హిస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా అధ్యక్షత వహిస్తారు. ఖ‌చ్చితంగా ఈ భేటీ హాట్‌హాట్‌గా కొన‌సాగ‌నుంది. తాము ఎన్ని చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అందుకే పార్టీకి ఈ గ‌తి ప‌ట్టింద‌ని నేత‌లు నిల‌దీయ‌నున్నారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీలో సంస్థాగ‌త ఎన్నిక‌లు పెట్టాల‌ని, అధ్య‌క్షుడి మార్పు కూడా చేయాల‌ని ఈ స‌మావేశంలో చ‌ర్చ సాగ‌నుంది. సోనియా కూడా నాన్ గాంధీ కేటగిరీలో తమకు అనుకూలమైన నేతను తెచ్చి అధ్య‌క్షున్ని చేసే ప్రతిపాదన కూడా ఉందని అంటున్నారు. మ‌రి సోనియా ఏం చేస్తుందో చూడాలి.

ఏది ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లిష్ట ప‌రిస్థితిలో ఉంది… దానిని అధినేత్రి సోనియా ఎలా ఎదుర్కొంటారు.. అనేదానిపై పార్టీ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like