ప్ర‌ధాని ప‌ద‌విపై కాంగ్రెస్ కి ఆస‌క్తి లేదు

Congress:ప్రధాని పదవిపై కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్ప‌ష్టం చేశారు. బెంగ‌ళూరులో 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో కీలక సమావేశం నిర్వహిస్తున్న తరుణంలో ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. ‘కాంగ్రెస్‌కు అధికారంపైనా, ప్రధాన మంత్రి పదవిపైనా ఆసక్తి లేదు.. గతంలో చెన్నైలోనూ ఎంకే స్టాలిన్ జన్మదిన వేడుకల్లో ఇదే చెప్పాను స‌మావేశం ఉద్దేశం అధికారం దక్కించుకోవడం కాదు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని కాపాడటం.. మనవి 26 పార్టీలు.. 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. బీజేపీకి సొంతంగా 303 సీట్లు రాలేదు. మిత్రపక్షాల ఓట్లను ఉపయోగించుకుని, తర్వాత ఆయా పార్టీలను విస్మరించింద’ని ఖర్గే ఆరోపించారు.

రాష్ట్రస్థాయిలో కొందరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు సైద్ధాంతికమైనవి కావు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల కోసం, యువత, పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల కంటే ఈ విభేదాలేమీ పెద్దవి కావు. ఎందుకంటే వారి హక్కులను తెరవెనుక నిశ్శబ్దంగా అణగదొక్కుతున్నారని ఆరోపించారు. ఈ ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, అప్నాదళ్ (కే), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే, వీసీకే, కేఎండీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), కేరళ కాంగ్రెస్ (జోసఫ్) పార్టీలు పాల్గొన్నాయి.

బెంగళూరు వేదికగా జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో విపక్షాల కూటమికి I-N-D-I-A అనే పేరును ఖరారు చేశారు. ప్రతిపక్ష ఫ్రంట్‌కు ‘భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I-N-D-I-A)’గా నామకరణం చేసినట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అధికారికంగా ప్రకటించారు. దేశాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మేమంతా చేతులు కలిపామని స్పష్టం చేశారు. సమావేశం ముగిసిన అనంతరం 26 పార్టీలకు చెందిన నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ఎన్డీఏ, ఇండియా మధ్య యుద్ధం జరగబోతుందని అన్నారు.

ఎన్‌డీఏ.. ఇండియాను సవాల్ చేయగలదా? బీజేపీ.. మీరు భారత్‌ను సవాలు చేయగలరా? మేము మా మాతృభూమిని ప్రేమిస్తున్నాం.. మేము దేశభక్తులం’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై దీదీ విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని పాలనా యంత్రాంగం చేసే పని ప్రభుత్వాలను కొనడం, అమ్మడం మాత్రమేనని మమత ధ్వజమెత్తారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను బీజేపీ వేధిస్తోందని మమతా బెనర్జీ అన్నారు. రాజ్యాంగ సంస్థల సాయంతో రాష్ట్రాల్లోని విపక్ష ప్రభుత్వాలను కూల్చడానికి చూస్తోందని ఆరోపించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like