బార్‌లోనే హ‌త్య‌కు కుట్ర

-శ‌ర‌ణ్య హ‌త్య కేసులో వీడిన మిస్ట‌రీ
-విడాకులు ఇవ్వలేదని హత్య చేయించిన భర్త
-సాక్ష్యం దొరకకుండా పకడ్బందీగా హత్య
-సాంకేతిక పరిజ్ఞానం తో నిందితుల గుర్తింపు
-నిందితుల‌ను వెంటాడి, వేటాడిన ఖాకీలు

Manchiryal Murder: నేను కనిపించ‌కుండానే నిన్నేం చేస్తానో చూడు.. అని నిందితుడు చేసిన హెచ్చ‌రిక‌లు నిజ‌మ‌య్యాయి. తాను విధుల్లో ఉంటూనే హ‌త్య‌కు ప‌థ‌కం ప‌న్నాడు.. పెద్దఎత్తున సుపారీ కూడా ముట్ట‌చెప్పాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జ‌రిగిన శ‌ర‌ణ్య హ‌త్య కేసులో పోలీసులు ఎట్‌‌కేల‌కు నిందితుల‌ను అరెస్టు చేశారు. విడాకులు ఇవ్వ‌లేద‌ని భ‌ర్తే హ‌త్య చేయించిన‌ట్లు వెల్ల‌డైంది. సాక్షాలు దొర‌క్కుండా త‌ప్పించుకున్న నిందితుల‌ను ఖాకీలు క‌ష్ట‌ప‌డి ఎంతో చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. త‌మ సిబ్బందిని డీసీపీ రాంనాథ్‌కేకన్ అభినందించారు.

ఈ నెల 10న సాయంత్రం గోపాల్ వాడ‌ రైల్వే కేబిన్ వ‌ద్ద శరణ్య అనే యువ‌తిని హ‌త్య చేశారు. నిందితులు క‌త్తుల‌తో పొడిచి, బండ‌రాళ్ల‌తో మోదీ మ‌రీ చంపేశారు. హత్యపై ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్ల‌డించారు. సయ్యద్ జియా ఉల్ హక్ CISF కానిస్టేబుల్ గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఇంటి ముందరే ఉన్న‌ బత్తిని శరణ్యను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. 19.02.2013 రోజు హైదరాబాదు ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. వారికి పాప పుట్టింది. తొమ్మిదేండ్ల త‌ర్వాత ఇద్దరి మధ్య వివాదాలు త‌లెత్తాయి. జియా ఉల్ హ‌క్‌ మరొక అమ్మాయితో పరిచయం పెంచుకుని శ‌ర‌ణ్య‌ను వేధించ‌డం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ కావటంతో శరణ్య మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్లో సయ్యద్ జియా ఉల్ హక్ పై 498 (A)కేసుతో పాటు జీవ‌న‌భృతి కోసం కేసు పెట్టింది. దానితో జియా ఉల్ హ‌క్ భార్యపై పగ పెంచుకొని తనకి విడాకులు ఇవ్వమని లేదంటే చంపుతానని శరణ్య ని చాలాసార్లు బెదిరించాడు. కానీ శరణ్య విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు.

ప‌గ పెంచుకున్న జియా ఉల్ హ‌క్ బక్రీద్ పండుగ సందర్భంగా సెలవులో ఇంటికి వచ్చాడు. తన స్నేహితుడు సాయికుమార్ తో తన భార్య శరణ్య ను చంపివేయాలని డబ్బులు ఇస్తే చంపే వ్యక్తులు ఎవరైనా ఉంటే చెప్పమని అడిగాడు. నీకు కూడా డ‌బ్బులు ఇస్తాన‌ని సాయికుమార్‌కు ఆశ చూపించాడు. దీంతో సాయికుమార్ అండాలమ్మ కాలనీలో ఉండే దారంగుల రాజు, అతని తమ్ముడు దారంగుల శివ హ‌త్య చేయ‌డానికి అంగీక‌రించారు. జూన్ నెల చివరలో నేరస్తులు జియా ఉల్ హక్ , సాయికుమార్, రాజు, శివ మంచిర్యాలలోని ఓ బార్ లో హ‌త్య చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. సుపారీ మాట్లాడగా రాజు, శివ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు.

హ‌త్య చేస్తే తొమ్మిది లక్షలు ఇస్తానని జియా ఉల్ హక్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాజు, శివలకు అడ్వాన్స్ గా 1,50,000/- రూపాయలు సుపారీ సెట్ చేసినందుకు సాయి కుమార్ కు 50,000/- రూపాయలు ఇచ్చారు. తర్వాత రాజు, శివ, చంద్రగిరి సాయికుమార్, మంచర్ల రవితేజ, పల్లికొండ అనిల్, పల్లికొండ శివ, వేముల సాయి, MD అమెర్లతో ఈ విష‌యమై చ‌ర్చించారు. అందరూ కలిసి శరణ్య ఇంటి నుండి హాస్పిటల్ కి వెళ్లే సమయం, ఇంటికి తిరిగి వచ్చే సమయం ఆమె వెళ్లే దారి ఇంటి పరిసర ప్రాంతాలు రెక్కీ చేశారు. రవితేజ ఆమె రైల్వే క్యాబిన్ గుండా వెళ్లే దారిలో ఉన్న రైల్వే ట్రాక్ ద‌గ్గ‌ర మర్డర్ చేయడానికి అనుకూలమైన ప్రదేశం అని, అక్కడైతనే ఎవరు ఉండరని స్కెచ్ వేశారు.

నిందితులు రెండు మూడు సార్లు ఆమెని హ‌త్య‌ చేయడానికి ప్రయత్నించి ఆ సమయం లో అటు వైపుగా మనుషులు రావడంతో వెన‌క్కి త‌గ్గారు. ఈ నెల 10న గోపాల్ వాడ రైల్వే క్యాబిన్ దగ్గర‌ ఉదయం 7 గంట‌ల‌కు శరణ్య రాక కోసం ఎదురు చూశారు. రాజు అతని తమ్ముడు శివ రైల్వే ట్రాక్ పక్కన చెట్ల పొదల్లోకి కత్తులను లోపల పెట్టుకొని వెళ్లారు. కొద్దిసేపటి శరణ్య తన పాపతో నడుచుకుంటూ వచ్చి ఆటోలో వెళ్ళింది. ఉదయం వారి ప్రయత్నం విఫలం కావటంతో తర్వాత శరణ్య ఇంటికి వెళ్ళేటపుడు సాయంత్రం 06.30 గంట‌ల‌ ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాటగానే రాజు శివ ఇద్దరు ఒక్కసారిగా చెట్ల పొదల నుండి బయటకు వచ్చి రాజు ఐదుసార్లు మెడపై, చేతులపై కత్తితో బలంగా నరికాడు.

శివ అక్కడే ఉన్న‌ రెండు పెద్ద బండ రాళ్ళతో ఆమె తలపై బాదాడు. ఆమె అక్కడికక్కడే రక్తపు మడుగులో చనిపోయింది. అయిదుగురు అక్కడి నుండి రైల్వే ట్రాక్ గుండా వెళ్ళి పారిపోయారు. రాజు, శివ ఇద్దరు బండిమీద పెద్దపల్లి వెళ్ళి అక్కడ బస్టాండ్ ఏరియాలో బండి పార్క్ చేసి బస్ ఎక్కి హైదరాబాద్ అక్కడి నుండి వైజాగ్ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చి తప్పించుకు తిరిగారు. జియా ఉల్ హ‌క్ మంచిర్యాల పోలీల్‌స్టేష‌న్‌లో లొంగిపోయాడు. వారి లావాదేవీల గురించి మాట్లాడేందుకు వ‌చ్చిన నిందితులు ఎనిమిది మందిని ప‌ట్టుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

ఈ ఘ‌ట‌న‌లో పాల్గొన్ సయ్యద్ జియా ఉల్ హక్(సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌), చంద్రగిరి (బైక్ మెకానిక్), దారంగుల రాజ్ కుమార్ (ట్రాక్టర్ డ్రైవరు), దారంగులశివ (ట్రాక్టర్ డ్రైవరు), పల్లికొండఅనిల్ (ఫర్నీచర్ వర్కర్), వేములసాయి (మేషన్ వర్క్), MD అమెర్ (JCB డ్రైవరు), పల్లికొండ శివ కృష్ణ (పెయింట‌ర్‌)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉన్న‌ మంచర్ల రవితేజ పరారీలో ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ హ‌త్య‌లో వాడిన ఐదు సెల్‌ఫోన్లు,చంద్రగిరి సాయికుమార్ వద్ద నుంచి రూ; 4000/- స్వాధీనం చేసుకున్నారు.

హ‌త్య కేసులో సాంకేతిక పరిజ్ఞానం ఉప‌యోగించి చాకచక్యంగా నిండితులను పట్టుకొని హత్య కేసు మిస్టరీ ఛేదించిన ఇన్‌స్పెక్ట‌ర్లు ఎం. రాజు , ఎన్‌. దేవయ్య, ఎస్ఐలు ఏ.రాజేందర్, కే. జగదీష్, రాకేశ్, కానిస్టేబుళ్లు బి,దివాకర్ (HC -249),తిరుపతి రెడ్డి (HC 569),రాము (PC 2964),సతీశ్(PC 2932),శేఖ‌ర్ (PC 3257), మహేశ్ (PC 2448), సతీష్ లను మంచిర్యాల డీసీపీ అభినందించి రివార్డు అందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like