వేలాల జాత‌రలో పోలీసుల నిరంత‌ర నిఘా

-50 సీసీ కెమెరాల‌తో ప‌టిష్ట భ‌ద్ర‌త
-477 మంది పోలీసుల సిబ్బందితో బందోబ‌స్తు
-భక్తులకు ఇబ్బందులు క‌లుగొద్దు
-భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలి

Jaipur: మహా శివరాత్రి సందర్బంగా వేలాల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసిన‌ట్లు జైపూర్ ఏసీపీ జీ.న‌రేంద‌ర్ వెల్ల‌డించారు. జాత‌ర‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల‌ను ప్రారంభించి పోలీసుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సందర్బంగా ఎసీపీ మాట్లాడుతూ వేలాల జాత‌రంలో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా ఇద్ద‌రు ఏసీపీలు, 10 మంది సీఐలు, 16 మంది ఎస్ఐలు, 80 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 210 మంది కానిస్టేబుళ్లు, 35 మంది మహిళా సిబ్బంది, 124 మంది హోంగార్డ్స్ మొత్తం 477 అధికారులు, సిబ్బంది మరియు 5 స్పెషల్ పార్టీ సిబ్బంది తో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు.

జాతర ప్రాంగణంలో, గుట్టపై జాతర మొత్తం 50 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో జాతర మొత్తాన్ని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచిన‌ట్లు వెల్ల‌డించారు.మహిళ భద్రత కోసం మహిళ పోలీసు సిబ్బందిని, షీ టీమ్స్, క్రైమ్ జరగకుండా మఫ్టీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు ఏసీపీ స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు సైతం ప‌లు సూచ‌న‌లు చేశారు. భ‌క్తులు క్యూ లైన్స్ పాటించాలని, బారికేడ్స్ దాటి బయటకు రావద్ద‌న్నారు. భక్తుల వాహనాల కోసం 4 పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేశామ‌ని, వాహ‌నాలు అక్క‌డే పార్క్ చేయాల‌ని కోరారు. VIP పార్కింగ్ గుట్ట సమీపంలో ఏర్పాటు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

రోడ్డు పైన వాహనాలను పెడితే ఆ వాహ‌నాల‌ను పోలీస్ స్టేషన్ తరలించి సీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించారు. వాహ‌నం న‌డిపే వ్య‌క్తి మ‌ద్యం సేవిస్తే ఆ వాహ‌నాన్ని సీజ్ చేసి కేసు రిజిస్ట‌ర్ చేస్తామ‌న్నారు. వృద్దులు, వికలాంగుల కోసం గుట్టపైకి వెళ్లడం కోసం ఆటోలకు పాస్ లు ఇచ్చామ‌న్నారు.గోదావరి నది నీటితో లోతుగా ఉంద‌ని, భక్తులు ఘాట్ల‌ వద్దనే స్నానాలు చేయాలని ఏసీపీ కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే జైపూర్ ఏసీపీ నరేందర్ 8712656548, సీఐ శ్రీరాంపూర్ బి.రాజు 8712656549, ఎస్ఐ జైపూర్ రామకృష్ణ 8712656551లకు ఫోన్ చేయవచ్చని భ‌క్తుల‌కు ఏసీపీ న‌రేంద‌ర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సీఐ శ్రీరాంపూర్ రాజు, జైపూర్ ఎస్ఐ రామకృష్ణ, మంచిర్యాల రూరల్ సీఐ ఈ సంజీవ్ మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like