శ‌ర‌ణ్య హ‌త్య‌కు కిరాయి హంత‌కులు

-అది సుపారీ హ‌త్యేన‌ని పోలీసుల ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌
-రూ. 6 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఒప్పందం కుదిరిన‌ట్లు అనుమానాలు..?
-ఆమె భ‌ర్తను అరెస్టు చేసేందుకు నేడు మ‌ధురైకి పోలీస్ బృందం
-శ‌ర‌ణ్య హ‌త్య కేసులో వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు

Murder: మంచిర్యాల‌లో శ‌ర‌ణ్య హ‌త్య కేసులో ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. శ‌ర‌ణ్య‌ను హ‌త్య చేసేందుకు ఆమె భర్త‌నే కిరాయి హంత‌కులను నియ‌మించిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా ఓ అంచ‌నాకు వ‌చ్చారు. ఈ దిశ‌గా ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసుల‌కు ప‌లు ఆధారాలు ల‌భ్య‌మైన‌ట్లు తెలుస్తోంది.

మంచిర్యాల‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌గా ప‌నిచేస్తున్న బ‌న్ని శ‌ర‌ణ్య (27) హ‌త్య కేసు సంచ‌ల‌నం సృష్టించింది. ఆమె హత్య కోసం ఇద్దరు కిరాయి హంత‌కులను నియమించినట్లు అనుమానిస్తున్నారు. శరణ్య గురువారం సాయంత్రం ఆసుప‌త్రిలో విధులు ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా, రైల్వే స్టేషన్ సమీపంలోని క్యాబిన్ వ‌ద్ద కత్తితో పొడిచి, నరికేశారు. బండ‌ల‌తో మోది మ‌రీ దారుణంగా హ‌త్య చేశారు. శ‌ర‌ణ్య భ‌ర్త జియా ఉల్ హ‌క్ కొన్ని వారాల కింద‌ట మంచిర్యాలకు వచ్చాడు. అప్పుడే శరణ్యను హత్య చేసేందుకు తన స్నేహితుల్లో ఒకరితో పాటు మరో వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. వారికి రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఎంత సుపారీ చెల్లించారనేది అతడిని అరెస్టు చేసిన తర్వాతే తేలనుందని ఓ పోలీసు అధికారి వెల్ల‌డించారు.

భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. దాదాపు మూడు సంవ‌త్స‌రాలుగా వేరేగా ఉంటున్నా త‌న‌తో విడాకులు తీసుకునేందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో జియా ఉల్ హ‌క్ శ‌ర‌ణ్య‌ను వ‌దిలించుకునేందుకు హ‌త్యకు ప‌థ‌కం ర‌చించిన‌ట్లు చెబుతున్నారు. హ‌త్య అనంత‌రం పోలీసులు అన్ని కోణాల్లో విచార‌ణ చేసి ఇద్ద‌రు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సూత్రధారి ఎవరు..? నేరంలో పాలు పంచుకున్న‌ది ఎంత మంది..? ఎందుకు నేరానికి పాల్పడ్డారు..? అనే విషయాలపై వీరిద్దరినీ విచారిస్తున్నారు. అదే స‌మ‌యంలో పోలీసులు శ‌ర‌ణ్య స్నేహితులు, ఆమెతో పాటు ఉద్యోగం చేస్తున్న మిగ‌తా వారిని సైతం ప్రశ్నించారు.

కాగా, శ‌ర‌ణ్య భ‌ర్త జియా ఉల్ హ‌క్ త‌మిళనాడులోని మధురై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అత‌న్ని ప‌ట్టుకునేందుకు పోలీసుల బృందం మదురైకి వెళ్లింది. మూడు సంవత్సరాల కింద‌ట‌ శరణ్యపై దాడి చేసినందుకు జియా ఉల్ హక్‌పై ఇప్పటికే కేసు నమోదైంది. ఆ త‌ర్వాత మంచిర్యాల‌ కోర్టులో విడాకుల కేసు సైతం దాఖలు చేశాడు. నిందితులను శనివారం లేదా ఆదివారం విలేక‌రుల ఎదుట హాజ‌రుప‌రిచే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like