అధికారుల అవినీతి… ప్ర‌జ‌ల అథోగ‌తి

-ఇంటి నంబ‌ర్ల‌ను మార్చేసిన కార్య‌ద‌ర్శి
-ఎన్నో ఏండ్లుగా ఉంటున్న వారిని కాద‌ని కొత్త వారికి కేటాయింపు
-డ‌బ్బులు తీసుకుని మ‌రీ నిర్వాహ‌కం
-అవినీతిలో మ‌రికొంద‌రు కార్య‌ద‌ర్శుల హ‌స్తం
-ఫిర్యాదు చేసినా ఇప్ప‌టికీ స్పందించ‌ని ఉన్న‌తాధికారులు
-త‌మ ఇంటి నంబ‌ర్లు గ‌ల్లంతు కావ‌డంతో ఊరంతా గ‌గ్గోలు
-గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యం వ‌ద్ద మాదారం 3 ఇంక్లైన్ గ్రామ‌స్తుల ఆందోళ‌న‌

Corruption: మీకు ఇంటి నెంబ‌ర్లు కావాలా డ‌బ్బులు ఇస్తే చాలు.. పాత ఇంటి నెంబ‌ర్లు మీకు కేటాయిస్తారు. ఏండ్ల‌కు ఏండ్లు ఇక్క‌డ ఉన్న వారి నంబ‌ర్లు సైతం మీకు ఇచ్చేస్తారు. మ‌రి పాత వారి సంగ‌తేంట‌ని మీకు అనుమానం రావ‌చ్చు. వారు ఎక్క‌డ పోతే మాకేంటి డ‌బ్బులు వ‌చ్చాయి క‌దా… ఎవ‌రెక్క‌డ పోతే మాకేంటి అనేది అధికారుల ఆలోచ‌న‌.. ఇప్పుడు అదే జ‌రిగింది. 40, 50 ఏండ్లుగా గ్రామంలో ఉంటున్న వారి నంబ‌ర్లు కొత్త‌గా ఇండ్లు క‌ట్టుకున్న వారికి ఇచ్చారు. పాత వారు మా ఇంటి నంబ‌ర్లు ఏవ‌ని అడిగితే మాకేం తెలుస‌నే స‌మాధానం వ‌స్తోంది. దీంతో ల‌బోదిబోమంటున్నారు మంచిర్యాల తాండూరు మండ‌లం మాదారం 3 ఇంక్లైన్ గ్రామ‌స్తులు…

బోర్ల‌కుంట పార్వ‌తి మాదారం-3 గ్రామంలో దాదాపు 40 ఏండ్లుగా నివాసం ఉంటోంది. త‌న‌కు పెంకుటిల్లు ఉంది.. ఇంటి నంబ‌ర్ 10-49 కాగా, అసెస్‌మెంట్ నంబ‌ర్ 167. కానీ, ఆ త‌ర్వాత ఆ నంబ‌ర్ మాయం అయ్యింది. ఆ నంబ‌ర్ కాస్తా మెరుగు మ‌ల్లేశ్వ‌రి భ‌ర్త అంకులు పేరుతో ప్ర‌త్య‌క్ష్యం అయ్యింది. ఖంగుతిన్న పార్వాతి ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఇంటి నంబ‌ర్ తిరిగి ఆమెకు కేటాయించారు. కానీ, ఇల్లు కొత్త‌గా క‌ట్టుకున్న‌ట్లు రికార్డుల్లో న‌మోదు చేశారు. ఇక్క‌డ అస‌లు విష‌యం ఏమిటంటే మెరుగు మ‌ల్లేశ్వ‌రి ఎన్నో ఏండ్లుగా ఇక్క‌డే ఉంటున్న‌ట్లు చూపెట్టారు. మ‌ల్లేశ్వ‌రి స్థానికంగా ఉండ‌నే ఉండ‌రు. ఇలా ఈ గ్రామ పంచాయ‌తీలో చాలా మంది ఇండ్ల పేరు ఇత‌రుల పేరుకు మారాయి.

కొత్త ఇండ్లు… పాత నంబ‌ర్లు..
మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం మాదారం త్రీ ఇంక్లైన్ గ్రామ పంచాయ‌తీలో కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన రాజ‌శేఖ‌ర్ నిర్వాహ‌కంతో జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారు. విచ్చ‌ల‌విడిగా డ‌బ్బులు దండుకుని గ్రామాన్ని ఆగ‌మాగం చేసిండ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మాదారం 3 ఇంక్లైన్ ప్రాంతంలో ఓపెన్‌కాస్టు వ‌స్తుండ‌టంతో ఇక్క‌డి భూముల‌కు విపరీత‌మైన డిమండ్ ఏర్ప‌డింది. దీంతో చాలా మంది బ‌య‌టి వ్య‌క్తులు ఇక్క‌డ విచ్చ‌ల‌విడిగా భూములు కొని వాటిల్లో ఇండ్లు క‌ట్టారు. కొత్త‌గా క‌ట్టిన‌ ఆ ఇండ్ల‌కు నంబ‌ర్లు కేటాయించారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఇండ్లు క‌ట్టుకున్న వారు అవి పాత ఇండ్లే అని చూపించుకునేందుకు అప్ప‌టి కార్య‌ద‌ర్శి రాజ‌శేఖ‌ర్‌ను క‌లిశారు. దీంతో ఆయ‌న తెలివిగా ఇక్క‌డ ఎన్నో ఏండ్లుగా నివసిస్తున్న గ్రామ‌స్తుల ఇండ్ల నంబ‌ర్లు కేటాయించారు. పాత ఇండ్ల నంబ‌ర్లు కేటాయించేప్పుడు క‌నీసం వారు ఇక్క‌డ ఉన్నారా..? లేరా..? అనే విష‌యం సైతం ధ్రువీక‌రించుకోకుండా వాటిని కేటాయించ‌డం గ‌మ‌నార్హం.

గ్రామ‌పంచాయ‌తీ వ‌ద్ద ప్ర‌జ‌ల ఆందోళ‌న‌..
ఈ తతంగం ఎప్పుడో జ‌ర‌గ్గా కొంద‌రు వ్య‌క్తులు ఉన్న‌తాధికారుల దృష్టికి సైతం తీసుకువెళ్లారు. అయినా, అధికారులు అటుగా దృష్టి సారించ‌లేదు. విష‌యం ఊరంతా పొక్క‌డంతో బుధ‌వారం గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న చేశారు. త‌మ‌కు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే, అక్క‌డే ఉన్న కొంద‌రు కొన్ని ఇండ్ల నంబ‌ర్లు మాత్ర‌మే మారాయ‌ని ఎవరికీ అన్యాయం జ‌ర‌గ‌లేద‌ని న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయినా విన‌కుండా వారు త‌మ ఆందోళ‌న కొన‌సాగించారు. దీంతో గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యం వ‌ద్ద గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా ఎస్టీ కాల‌నీకి చెందిన ప‌లువురు అక్క‌డికి చేరుకుని తాము 40 ఏండ్లుగా ఇక్క‌డ ఉంటున్నామ‌ని త‌మ ఇంటి నంబ‌ర్ లేక‌పోవ‌డం ఏమిట‌ని నిల‌దీశారు.

మ‌రికొంద‌రు కార్య‌ద‌ర్శుల పాత్ర‌..
ఈ వ్య‌వ‌హారంలో ఇక్క‌డ గ‌తంలో ప‌నిచేసిన రాజ‌శేఖ‌ర్‌దే కాకుండా మ‌రికొంద‌రు కార్య‌ద‌ర్శుల పాత్ర సైతం ఉన్న‌ట్లు చెబుతున్నారు. మండ‌లంలో ప‌నిచేస్తున్న వారితో పాటు చుట్టుప‌క్క‌ల మండ‌లాల కార్య‌ద‌ర్శులు ఆరుగురు ఇక్క‌డే ఇండ్లు క‌ట్టుకున్నారు. కొత్త‌గా నంబ‌ర్ తీసుకుంటే సింగ‌రేణి ప‌రిహారం వ‌స్తుందో రాదోన‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఆ కార్య‌ద‌ర్శులు పాత ఇంటి నంబ‌ర్లు కేటాయించుకున్నారు. దీంతో అక్క‌డ ఎన్నో ఏండ్లుగా ఉంటున్న వారికి అన్యాయం జ‌రిగింది. ఇదే కాకుండా పాత నంబ‌ర్లు కేటాయించేందుకు రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వ‌ర‌కు వ‌సూలు చేసిన‌ట్లు స‌మాచారం. ఇలా విచ్చ‌ల‌విడిగా నంబ‌ర్లు కేటాయించ‌డంతో గ్రామ‌స్తులు ల‌బోదిబోమంటున్నారు.

పోలీసుల జోక్యంతో స‌ద్దుమ‌ణిగిన వివాదం..
గ్రామ‌పంచాయ‌తీ వ‌ద్ద ఆందోళ‌నతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు.ఎస్సై రాజ‌శేఖ‌ర్ అక్క‌డికి చేరుకుని స‌మ‌స్య విని ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ్రామ‌స్తుల‌తో సైతం మాట్లాడారు. సంబంధిత అధికారుల‌తో మాట్లాడి దీనిని ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. దీంతో గ్రామ‌స్తులు శాంతించారు. స‌మ‌స్య ఇంత దూరం రావ‌డానికి కార‌ణం ఉన్న‌తాధికారులేన‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఫిర్యాదు చేసినా క‌నీసం వాటిని ప‌ట్టించుకోలేదు. దీంతో ఇది ఇంత దూరం వ‌చ్చింద‌ని ప‌లువురు చెబుతున్నారు. అధికారులు ఆదిలోనే స‌మ‌స్య ప‌ట్టించుకుంటే అది ఎప్పుడో ప‌రిష్కారం అయ్యేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like