కోవిడ్ ఎదుర్కోవడానికి సింగరేణి సిద్ధం

జి.ఎం.లు, వైద్యాధికారులతో డైరెక్టర్‌ (పా) బలరామ్‌ వీడియో సమీక్ష

దేశ వ్యాప్తంగా కోవిడ్‌ మరో రూపంలో విజృంభిస్తున్న నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న వైద్య విభాగం, ఏరియా జి.ఎం.లు దీనిని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్లానింగ్‌, పర్సనల్‌) ఎన్‌.బలరామ్‌ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఈ విషయంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులకు ఇప్పటికే దాదాపు నూరుశాతం వాక్సినేషన్‌ పూర్తి చేశామన్నారు. మిగిలి ఉన్న కొద్ది మందికి వారి ఇళ్ల వద్దకే వెళ్లి వాక్సినేషన్‌ పూర్తి చేయాలన్నారు. 60 సంవత్సరాల పైబడిన కార్మికులకు ఈ నెల 10వ తేదీ నుండి 2 రోజుల్లో బూస్టర్‌ డోస్‌ వేయాలని ఆదేశించారు.

రాష్ట్ర వైద్యశాఖ ఆధ్వర్యంలో 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాక్సినేషన్ ప్రారంభించిన విష‌యం ఆయ‌న గుర్తు చేశారు. సింగరేణి ప్రాంతంలో ఈ వయసు గ్రూపు వారికి కంపెనీ ఆస్పత్రుల్లో వాక్సినేషన్‌ చేయాలన్నారు. ప్రస్తుతం 40 వేల రాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టు కిట్లు సిద్ధంగా ఉన్నప్పటికీ రానున్న కాలంలో వీటి కొరత సింగరేణిలో ఏర్పడకుండా ఉండటానికి మరో 50 వేల కిట్లు కొనుగోలు చేయనున్నామని తెలిపారు.

సింగరేణి వ్యాప్తంగా 500కు పైగా ఆక్సిజన్‌ సౌకర్యం గల బెడ్లు ఉన్నాయనీ, అవసరాన్ని బట్టి వీటిని 1500 వరకూ పెంచుకోవచ్చనీ, గత ఏడాది సంస్థ సి అండ్‌ ఎం.డి. శ్రీధర్‌ ఆదేశం మేరకు ఐదు చోట్ల ఏర్పాటుచేసిన ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలు సమర్ధంగా పనిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు కావాల్సిన సిలెండర్లను ఏరియా పరిధిలోని ఆస్పత్రులకు సమకూర్చుకోవాలన్నారు. మందులు ఇంజెక్షన్లకు ఎటువంటి కొరత రాకుండా హైద్రాబాద్‌ కార్యాలయం నుండి జి.ఎం. (సి.డి.ఎన్‌.) ఆధ్వర్యంలో వాటిని సమకూర్చుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అన్ని ఏరియాల జి.ఎం.లతో ప్రస్తుతం ఉన్న కోవిడ్‌ కేసుల సంఖ్య, ఆస్పత్రుల వారీగా ఉన్న‌ బెడ్లు, ఇంజెక్షన్లు, క్వారంటైన్‌ కిట్లు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అన్ని ఏరియాల జి.ఎం.లు వెంటనే తమ పరిధిలోని సింగరేణి ఆస్పత్రులను సందర్శించి కోవిడ్‌ పరిస్థితులు ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.

జీఎం (కోఆర్డినేషన్‌) కె.సూర్యనారాయణ మాట్లాడుతూ హైద్రాబాద్‌ నుండి ఏరియాలకు కావాల్సిన మందులు, ఇంజెక్షన్లు, రాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లు, క్వారంటైన్‌ కిట్లను ఏరియాల అవసరాల మేరకు వెంటవెంటనే అందజేస్తామన్నారు. డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్ బాలకోటయ్య వైద్య పరమైన సందేహాలపై వివరణ ఇచ్చారు. హైద్రాబాద్‌ కార్యాలయం నుండి జీఎం (స్ట్రాటజిక్‌ ప్లానింగ్‌) కె.సురేందర్‌, ఎస్వోటు డైరెక్టర్‌ (పా) రవిప్రసాద్‌, కొత్తగూడెం కార్యాలయం నుండి జీఎం (ఐ.ఆర్‌.అండ్‌పి.ఎం.) ఆనందరావు, జీఎం (పర్సనల్‌ అండ్‌ వెల్ఫెర్‌) బసవయ్య, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. శ్రీనివాస్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like