సీఎస్ఆర్‌.. నిబంధ‌న‌లు బ‌లాదూర్‌..

-సొమ్ము సింగ‌రేణిది... సోకు ప్ర‌భుత్వానిది
-సింగ‌రేణి ప్ర‌భావిత గ్రామాలు కాకున్నా నిధులు ఖ‌ర్చు
-త‌మ‌ భ‌వ‌నాల‌కు హంగులు దిద్దుకుంటున్న ఎమ్మెల్యేలు
-సింగ‌రేణి ప్ర‌భావిత గ్రామాల్లో అల్లాడుతున్న ప్ర‌జ‌లు
-సీఅండ్ఎండీ శ్రీ‌ధ‌ర్ వ‌చ్చాక ప‌ప్పు,బెల్లాల్ల నిధుల పంపిణీ
-తాన తందాన కార్మిక సంఘాల వైఖ‌రిపై కార్మికుల్లో ఆగ్ర‌హం

మంచిర్యాల : కార్మికుల చెమ‌ట చుక్క‌లు అవి… త‌మ ర‌క్తాన్ని చెమ‌ట‌గా మార్చి సంస్థకు లాభాలు తెచ్చిపెడుతుంటే అధికారులు మాత్రం వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. సింగ‌రేణి లాభాలు సంస్థ అభివృద్ధికి వినియోగించకుండా ఇతరుల రాజకీయప్రయోజనాలకు మళ్లిస్తున్న తీరు పట్ల ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థకు బడ్జెట్‌లో నయాపైసా నిధులు కూడా కేటాయించని రా ష్ట్ర ప్రభుత్వం సంస్థ నిధులను మాత్రం ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాడుకుంటోంది. గనుల తవ్వకాల మూలంగా ప్రభావిత ప్రాంతాలలో వసతుల అభివృద్ధికి మూడు దశాబ్ధాలుగా సింగరేణి , సీఎస్‌ఆర్‌ పథకాలతో ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. గ‌తంలో ఈ ప్రాంతంలోనే ఖ‌ర్చు చేసిన సంస్థ ఇప్పుడు ఆ నిధులు ఇత‌ర ప్రాంతాల‌కు ఖ‌ర్చు చేస్తోంది. సంస్థ సీఅండ్ఎండీగా శ్రీ‌ధ‌ర్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యార‌య్యింది.

సీఎస్ఆర్ నిబంధ‌న‌లు ఏంటి..?
సీఎస్ఆర్ నిధులను సింగ‌రేణి ప్ర‌భావిత ప్రాంతాల‌కు మాత్ర‌మే ఖ‌ర్చు చేయాలి. గ‌నులు ఉన్న ప్రాంతాల్లో 80 శాతం, మిగ‌తా ప్రాంతాల్లో 20 శాతం ఖ‌ర్చు చేసుకునే వీలుంది. కానీ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా గ‌నులు ఉన్న ప్రాంతాల్లోనే 20 శాతం ఖ‌ర్చు చేస్తుండ‌గా, ఇత‌ర ప్రాంతాల‌కు 80 శాతం నిధులు పంపిస్తున్నారు. ఈ నిధుల‌కు సంబంధించి కంపెనీల చట్టం యొక్క షెడ్యూల్ VII ప్రకారం స్ప‌ష్ట‌మైన నిబంధ‌న‌లు ఉన్నాయి. ఆకలి, పేదరికం, పోషకాహార లోపాన్ని నిర్మూలించడం కోసం నిధులు ఖ‌ర్చు చేయాలి. పరిశుభ్రత ప్రోత్సహించడం, ప్ర‌జ‌ల‌కు ర‌క్షిత మంచినీటిని అందించాలి. ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేక విద్య, ఉపాధితో సహా విద్యను ప్రోత్సహించడం, ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాలి. మహిళలకు సాధికారత కల్పించడం కోసం నిధులు వెచ్చించాలి. షెడ్యూల్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళల సామాజిక ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం కోసం చ‌ర్య‌లు తీసుకోవాలి.

నిధులు ప‌క్క‌దారి…
నిబంధ‌న‌లు ప‌క‌డ్బందీగా ఉన్న‌ప్ప‌టికీ అధికారులు వాట‌న్నింటిని క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డాల్సిన ప‌నులు కాకుండా, ఎమ్మెల్యేల సేవ‌ల‌కు ఈ నిధుల‌ను పంపిణీ చేస్తున్నారు సింగ‌రేణి అధికారులు. భూపాల‌ప‌ల్లిలో ప్ర‌స్తుతం ఒక స్విమ్మింగ్‌ఫూల్ ఉంది. కానీ మ‌ళ్లీ ఇప్పుడు రూ. కోటి యాభై ల‌క్ష‌ల‌తో మ‌రో స్విమ్మింగ్‌ఫూల్ నిర్మాణానికి సిద్ధ‌మ‌య్యారు. ఇవీ సీఎస్ఆర్ నిధులే. అంత పెద్ద స్విమ్మింగ్‌ఫూల్ నిర్మాణం ఎందుకో అంతుప‌ట్ట‌ని ప్ర‌శ్న‌గా మారింది. అంత‌ర్జాతీయ స్థాయిలో త‌ల‌ప‌డే క్రీడాకారులు ఉంటే త‌ప్ప ఇలాంటి స్విమ్మింగ్‌ఫూల్ అవ‌స‌రం లేద‌ని ప‌లువురు ఎద్దేవా చేస్తున్నారు. సూర్యాపేటలో క్రీడల నిర్వహణకు ₹ 20 లక్షలు ఖ‌ర్చు చేశారు. అక్కడే కమ్యూనిటీ హాళ్లు ఇతర ఖర్చు లకు కోటి రూపాయలు సీఎస్ఆర్ నిధులు వెచ్చించారు. మెట్ పల్లి స్టేడియం ఇతర ఖర్చులకు పెద్దమొత్తంలో కేటాయింపు. వరంగల్ సీసీ కెమెరాలనిర్వహణకు.. కొండగట్టు ఆలయంలో ఖర్చులకు ఇలా ప్రభుత్వం చేయాల్సినవన్నీ సింగరేణి చేస్తుంది.

ఇవి మ‌రిన్ని సిత్రాలు..
సిద్ధిపేట‌లో స్టేడియం నిర్మాణానికి మంత్రి హ‌రీష్ రావు సైతం ఇక్క‌డ నుంచే సీఎస్ఆర్ నిధులు త‌ర‌లించుకువెళ్లారు. నిర్మల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.1.50 కోట్లతో వివిధ ర‌కాలైన ప‌నులు చేశారు. సిద్దిపేటలోని స్టేడియంకు సంబంధించి రూ.1 కోటి, ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సుందరీకరణ పనులు రూ. 16 లక్షలు పైననే ఖ‌ర్చు చేశారు. సత్తుపల్లిలో పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం రూ.1 కోటి కేటాయించారు. వాస్త‌వానికి ఇది సీఎస్ఆర్ పరిధిలోకి రాదు. పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.50 లక్షలు అందించారు. మెట్‌ప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల్లో వివిధ ప‌నుల కోసం రూ. 1.10 కోట్లు కేటాయించారు. ఇల్లందు ఎమ్మెల్యే కార్యాలయానికి పనులు రూ.20 లక్షలు ఇచ్చారు. ఇలా సింగ‌రేణి సంస్థ నిధులు ఎమ్మెల్యేలు త‌మ ఇష్టారాజ్యంగా ఖ‌ర్చు చేస్తున్నారు. అది కూడా సింగ‌రేణి ప్ర‌భావిత గ్రామాల్లోని ఎమ్మెల్యేలు కాకుండా, బ‌య‌టి వారే అధికంగా ఖ‌ర్చు పెట్టుకుంటున్నారు.

సింగ‌రేణి ప్రాంతాల ప‌రిస్థితి ఏంటి..?
సింగ‌రేణి ప్ర‌భావిత గ్రామాల్లో ఎన్నో స‌మ‌స్య‌లు రాజ్య‌మేలుతున్నాయి. ఆయా ఏరియాల్లో ఉన్న చుట్టు ప‌క్క‌ల గ్రామాల్లో గిరిజ‌నులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. వారికి క‌నీస వైద్య స‌దుపాయాలు, తాగునీటి సౌక‌ర్యం, విద్య లేక అవస్థ‌లు ప‌డుతున్నారు. ఇలాంటి వారికి మౌలిక స‌దుపాయాల్లో చూపించాల్సిన శ్ర‌ద్ధ ఏ మాత్రం చూపించ‌డం లేదు. సింగ‌రేణి గ‌నుల‌తో ఈ ప్రాంతం వారు న‌ష్ట‌పోతుండ‌గా, నిధులు మాత్రం ఇత‌ర ప్రాంతాల‌కు ఖ‌ర్చు చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అవుతున్నాయి. అధికారులు తాము ఎక్క‌డా నిబంధ‌న‌లు అతిక్ర‌మించ‌డం లేద‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

తాన తందాన కార్మిక సంఘాలు..
ఇక సింగ‌రేణిలో కార్మిక సంఘాల గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత మంచిది. కార్మిక సంఘాలు కార్మికుల స‌మ‌స్య‌ల గురించి, సంస్థ‌లో నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడం ఎప్పుడో మానేశారు. కేవ‌లం త‌మ సొంత ప‌నులు చేసుకునేందుకు మాత్ర‌మే కార్మిక సంఘాల నేత‌లుగా చెలామ‌ణి అవుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి తాము పోరుబాట ప‌డ‌తామ‌ని ఏఐటీయూసీ ప్ర‌క‌టించింది. గ‌తంలో ముఖ్‌నమంత్రి వ‌చ్చిన‌ప్పుడు కూడా నిధులు దుర్వినియోగం అయ్యాయ‌ని అవ‌స‌రం అయితే కోర్టుకు వెళ్తామ‌ని చెప్పింది. త‌ర్వాత మౌన‌మే స‌మాధానం అయ్యింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like