ద‌ళిత బ‌స్తీ భూమే హ‌త్య‌కు కార‌ణం

-రెండో భ‌ర్త‌, మామ‌, మ‌రిదే హంత‌కులు
-కోట‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయిన నిందితులు

Murder: మంచిర్యాల‌లో మ‌హిళ హ‌త్య విష‌యంలో ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ద‌ళిత బ‌స్తీ కింద ప్ర‌భుత్వం ఇచ్చిన మూడెక‌రాల భూమికి సంబంధించిన వివాద‌మే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. ఆ మ‌హిళ‌ను చంపింది రెండో భ‌ర్త‌, మామ‌, మ‌రిదేన‌ని స‌మాచారం. ఆమెను హ‌త్య చేసిన ఆ ముగ్గురూ కోట‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు మహిళపై దాడి చేసి చంపేశారు. అందరు చూస్తుండగానే మహిళ పై కత్తులతో దాడి చేశారు. ఆ ముగ్గురు వ్యక్తులు TS 19 E 7695 బైక్ పై వచ్చి కత్తులతో నరికి హత్య చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. మృతిచెందిన మహిళ రాజీవ్ నగర్ కాలనీకి చెందిన స్వప్న శ్రీ గా పోలీసులు గుర్తించారు. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

స్వ‌ప్నశ్రీ మొదటి భర్త చనిపోవడంతో వేల్పుల మ‌ధు అనే వ్య‌క్తిని రెండో పెళ్లి చేసుకుంది. కోటపల్లి మండలం వెంచ‌ప‌ల్లిలో ద‌ళిత‌బ‌స్తీ కింద స్వ‌ప్నపేరుతో మూడెక‌రాల భూమి వ‌చ్చింది. రెండో భర్తతో మనస్పర్ధలు వచ్చి స్వ‌ప్న వేరే వ్య‌క్తితో మంచిర్యాల‌లో ఉంటోంది. త‌న పైర‌వీ వ‌ల్ల‌నే భూమి వ‌చ్చింద‌ని త‌న భూమి త‌న‌కు కావాలంటూ స్వ‌ప్నపై రెండో భ‌ర్త మ‌ధు ఒత్తిడి తెచ్చాడు. అయినా దానిపై స్వ‌ప్న స్పందించ‌క‌పోవ‌డంతో ఈ హ‌త్యకు పాల్ప‌డ్డంటూ స‌మాచారం. ఈ కోణంలోనే పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

ఘట‌నా స్థ‌లానికి చేరుకున్న డీసీపీ ఆధారాలు, వివరాలు సేక‌రించారు. మృత‌దేహాన్ని మంచిర్యాల జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసులో పురోగతి సాధించారు. స్వ‌ప్న రెండో భ‌ర్త మ‌ధు, ఆమె మామ‌, మ‌రిది క‌లిసి ఈ హ‌త్య‌కు ప‌థ‌కం ప‌న్నిన‌ట్లు తెలుస్తోంది. హ‌త్య చేసిన వారు వెళ్లి నేరుగా కోట‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయారు. ఇక మూడో భ‌ర్త‌ను సైతం మంచిర్యాల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like