దండే విఠ‌ల్ నెక్ట్స్ టార్గెట్..?

ఉమ్మ‌డి ఆదిలాబాద్ స్థానిక సంస్థ‌ల అభ్య‌ర్థి ఎంపిక అయిపోయింది. ప్ర‌స్తుతం ఓట‌ర్ల‌ను క్యాంపుల‌కు త‌ర‌లించే కార్య‌క్రమం పూర్త‌య్యింది. అధికార పార్టీ అభ్య‌ర్థి కావ‌డంతో దాదాపు గా దండే విఠ‌ల్ గెలుపొంద‌డం ఖాయం. ఆయ‌న ఎమ్మెల్సీ అయిన త‌ర్వాత ల‌క్ష్యం ఏమిటి..? ఆయ‌న ఏం చేస్తారు..?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ చాలా వ్యూహాత్మ‌కంగా ముంద‌డుగు వేశారు. అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో స్థానికంగా ఎంతో మంది పోటీ ప‌డినా వారికి ఎవ‌రికీ టిక్కెట్టు ద‌క్క‌లేదు. అనూహ్యంగా దండే విఠ‌ల్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. వాస్త‌వానికి ఆయ‌న పేరు ప్ర‌క‌టించే వ‌ర‌కూ కూడా ఇక్క‌డి వారికి ఎవ‌రికీ ఆయ‌న తెలియ‌దు. మ‌రి హ‌ఠాత్తుగా ఎందుకు ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని కేసీఆర్ ఖ‌రారు చేశార‌నే అంశంలో చాలా మంది అనుమానాలు వ్య‌క్తం చేశారు. విఠ‌ల్ కాగ‌జ్‌న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన వాడైనా ఇక్క‌డ నుంచి విద్యాభ్యాసం పూర్తి కాగానే ఇక్క‌డి నుంచి వెళ్లిపోయారు. మ‌రి ఆయ‌న ఎంపిక‌లో ముఖ్య‌మంత్రి ఏం ఆలోచించారు…? ద‌ండే విఠ‌ల్ కూడా ఇక్క‌డ‌కు వ‌చ్చేందుకు అంత ఆస‌క్తి ఎందుకు చూపించారు అనే విష‌యంలో చాలా మంది ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

సిర్పూరు కేంద్రంగా రాజ‌కీయాలు…
ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అన్ని ర‌కాల స‌మీక‌ర‌ణాలు చూసిన త‌ర్వాతే అభ్య‌ర్థి ఎంపిక చేశారు. ఇందులో దండే విఠ‌ల్ మున్నూరు సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. సిర్పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ సామాజిక వ‌ర్గానికి పెద్ద ఎత్తున ఓట్లు ఉన్నాయి. దండేవిఠ‌ల్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారని స‌మాచారం. ముందుగా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో పాగా వేసి ఇక్క‌డ ప‌రిస్థితులు ఆక‌లింపులు చేసుకున్న త‌ర్వాత సిర్పూర్ ఎమ్మెల్యే టిక్కెట్టు సంపాదించుకోవ‌చ్చ‌నేది ఆయ‌న ప్లాన్‌గా క‌నిపిస్తోంది. అందుకే ఆయ‌న ఎమ్మెల్సీ టిక్కెట్టు తీసుకున్న‌ట్లు రాజ‌కీయ ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. మ‌రోవైపు ఆయ‌నకు ఉద్య‌మ కారుడ‌నే కార్డు, ఆర్థికంగా బ‌ల‌వంతుడు కావ‌డంతో అన్ని ర‌కాలుగా క‌లిసివ‌స్తుంద‌ని ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి, కేటీఆర్ ద‌గ్గ‌ర ఉన్న చ‌నువుతో మంత్రిగా ఛాన్స్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని భారీ ప్లాన్‌తో ఉన్న‌ట్లు స‌మాచారం.

కోనేరుకు సైతం అధినేత ద‌గ్గ‌ర మంచి పేరు..
అయితే కోనేరు కోన‌ప్ప‌ను అంత‌గా ఈజీగా త‌ప్పించే అవ‌కాశం ఏ మాత్రం లేదు. ఎందుకంటే కోన‌ప్ప‌కు అధినేత ద‌గ్గ‌ర చాలా మంచి పేరుంది. కోన‌ప్ప 2014లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ త‌ర్వాత టీఆర్ ఎస్‌లో చేరారు. 2018లో సైతం విజ‌యం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో చేస్తున్న ప‌నులు, కార్య‌క్ర‌మాలకు ముచ్చ‌ట ప‌డిన కేసీఆర్ ఆయ‌న‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు కూడా.. ఇక్క‌డ కోనేరు ట్ర‌స్టు పేరుతో, స్వంతంగా కూడా ఎన్నో సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. అవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు చేరువుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్ వ‌ద్ద కోన‌ప్ప‌కు మంచి మార్కులే ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో కోన‌ప్ప‌ను కాద‌ని దండే విఠ‌ల్‌కు టిక్కెట్టు ఇస్తారా..? అనేది అనుమాన‌మే.

ఏదీ ఏమైనా మ‌రి కొద్ది రోజుల్లో సిర్పూరు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి. అధినేతకు ఈ ఇద్ద‌రూ నేత‌లు ద‌గ్గ‌ర కావ‌డంతో ఎవ‌రికి టిక్కెట్టు ద‌క్కుతుంది..? అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి రాజ‌కీయాలు చోటు చేసుకుంటాయ‌నేది ప్ర‌శార్థ‌క‌మే. అదే స‌మ‌యంలో దండే విఠ‌ల్ సిర్పూర్ రాజ‌కీయాల‌ను ఏ మేర‌కు ప్ర‌భావితం చేస్తార‌నేది వేచి చూడాల్సిందే. ఇప్ప‌టి వ‌ర‌కైతే నేత‌లు అంద‌రం క‌లిసి ప‌నిచేస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేసినా ముందు ముందు రాజకీయాలు ఏ విధంగా మారుతాయో అని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like