మార్కెట్ కూల్చేస్తాం… మాతా శిశు సంర‌క్ష‌ణా కేంద్రం నిర్మిస్తాం

మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావు ఆల్టిమేటం

Premsagar Rao: తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంట‌నే మంచిర్యాలలోని ఐబీలో నిర్మిస్తున్న మార్కెట్ భవనం కూల్చివేసి అక్కడ మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తానని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ స్ప‌ష్టం చేశారు. అవ‌స‌రం అయితే,నిబంధనలను సైతం ఉల్లంఘిస్తానని తెలిపారు. శనివారం మంచిర్యాలలోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ ఓటమి ఖాయ‌మ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్య‌క్తం అవుతోంద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే త‌మ బతుకులు బాగుపడతాయనే భావనతో ప్రజలు ఉన్నారని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గం 20 ఏండ్లు వెన‌క‌బ‌డింద‌ని స్ప‌ష్టం చేశారు. అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజాధనం దుబారా అవ‌డం త‌ప్ప వారికి ఒరిగింది ఏమీ లేద‌ని వెల్ల‌డించారు. ఎక్క‌డి ప‌నులు అక్క‌డే నిలిచిపోయాయ‌ని చెప్పారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజలకు సేవ చేశానని తెలిపారు. ప్రజల మేలు కోసం తాను చేసిన పోరాటాలు గుండాయిజం అయితే అందుకు తాను సిద్ధంగా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరికలు
మంచిర్యాల, లక్షేట్టిపేట మండలాలకు చెందిన ప‌లువురు బీఆర్ఎస్ నేత‌లు శనివారం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మంచిర్యాలకు చెందిన సుధామల్ల అశోక్ తేజ, హమాలివాడకు చెందిన ఈసంపల్లి భాస్కర్, లక్షేట్టిపేట మండలం గుళ్లకోటకు చెందిన మాజీ ఉప సర్పంచ్ చంద్రయ్య తన సన్నిహితులు ప‌లువురు కాంగ్రెసులో చేరారు. ప్రేమ్ సాగర్ రావు వారికి కండువాలు కప్పి కాంగ్రెసులోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని ప్రేమ్ సాగర్ రావు అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like