దేశంలో మ‌న‌మే నంబ‌ర్‌.1

జాతీయ స్థాయిలో 1వ స్థానంలో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం తన మెరుగైన ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ ఎఫ్‌) తో 2021-22 లో డిసెంబరు నాటికి దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో 1వ స్థానంలో నిలిచింది. దీనిపై సింగ‌రేణి సంస్థ సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీధర్‌ ప్రశంసలు కురిపించారు.

సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఇఏ) ర్యాంకింగ్‌ లో తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం అన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల కన్నా మిన్నగా ఏప్రిల్‌, 2021 నుంచి డిసెంబరు నాటికి సగటున 87.18 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణ స్టేట్‌ జెన్‌ కో 73.98 శాతం పి.ఎల్‌.ఎఫ్‌.తో రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 70.29 శాతం పి.ఎల్‌.ఎఫ్‌.తో పశ్చిమ బెంగాల్‌ పవర్‌ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్‌ మూడవ స్థానంలో , 68.10 శాతం పి.ఎల్‌.ఎఫ్‌.తో చత్తీస్‌ఘడ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ నాలుగవ స్థానంలో, 63.95 శాతం పి.ఎల్‌.ఎఫ్‌.తో ఒడిస్సా పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ ఐదవ స్థానంలో, 58.83 శాతం పి.ఎల్‌.ఎఫ్‌.తో ఆంధ్రప్రదేశ్‌ జెన్‌ కో ఆరవ స్థానంలో నిలిచాయి. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం రాష్ట్రాల నిర్వహణలో ఉన్న‌ పవర్‌ ప్లాంట్లలో ప్రథమ స్థానంలో నిలవడంపై సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్‌.శ్రీధర్‌ ప్లాంట్‌ అధికారులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. మంచి దార్శనికతతో ప్రస్తుత స్థాయి నుంచి మరింత ఎదగడానికి లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని, తద్వారా ప్లాంట్‌ దేశంలోనే ప్రథమ స్థానానికి కూడా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మొదటి నుండి మంచి పి.ఎల్‌.ఎఫ్‌. సాధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో ఉన్న‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలలో అగ్రగామిగా ఉంది. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందుతూ వస్తోంది. గత ఆర్ధిక సంవత్సరం డిసెంబర్‌ నెల వరకూ ఈ విద్యుత్‌ కేంద్రం 5,335 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగా ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్‌ నెలవరకూ 29 శాతం వృద్ధితో 6,904 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలానికి 2,386 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపిన సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్‌ వరకూ 20 శాతం వృద్ధితో 2,879 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపింది. థర్మల్‌ ప్లాంట్‌ కు శ్రీరాంపూర్‌ ఏరియా నుంచి బొగ్గు సరఫరా చేయడం కోసం సింగరేణి సంస్థ నిర్మించిన రైల్వే లైన్‌ పై విద్యుదీకరణ పనుల ను మరో ఆరు నెలల్లో పూర్తి చేయాలని సీఅండ్ఎండీ ఆదేశించారు. థర్మల్‌ ప్లాంట్ ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా రక్షణ తో నిర్వహించడం సంతోషకరమన్నారు. అయినా ముందస్తు జాగ్రత్తగా రక్షణ పై ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రక్షణ సూత్రాలు అమలు జరిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాంట్‌ లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ సుందరీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు.

లోయర్‌ మ్యానేర్‌ రిజర్వాయర్‌ పై ఫ్లోటింగ్‌ సోలార్‌ కు సన్నాహాలు ముమ్మరం
కరీంనగర్‌ సమీపంలో లోయర్‌ మ్యానేర్‌ రిజర్వాయర్‌పై సింగరేణి నిర్మించతలపెట్టిన ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ పై సీఅండ్ఎండీ శ్రీధర్‌ సమీక్షించారు. డ్యాం వద్ద జరుగుతున్న సర్వే పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ను ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ అనుమతి పొందిన వెంటనే మార్చి నెలలో టెండర్లు పిలుస్తామ‌న‌నారు. ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం నుంచి పొందడానికి ప్రత్యేక చొరవ చూపాలని అధికారులకు సూచించారు.ఇప్పటి వరకు 219 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ ప్లాంట్లను పూర్తి చేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించడం హర్షనీయ‌మ‌న్నారు. దేశంలో ఏ బొగ్గు సంస్థ చేపట్టని విధంగా సింగరేణి సోలార్‌ ప్లాంట్ల ద్వారా వ్యాపార విస్తరణ చర్యలు చేపట్టిం దన్నారు. అతి తక్కువ సమయంలో సింగరేణి సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం జరిపి ఉత్పత్తి ప్రారంభించినందుకు జాతీయ స్థాయి లో సింగరేణి కి సోలార్‌ ఎక్స్‌ లెన్సీ అవార్డు రావడం మన కృషికి తగిన గుర్తింపని పేర్కొన్నారు. ఇక ముందు మరిన్ని సోలార్‌ ప్లాంట్లు సింగరేణి సంస్థ చేపడుతుందని తెలిపారు. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం లోని వాటర్‌ రిజర్వాయర్‌ పై నిర్మించతలపెట్టిన 15 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ లో 5 మెగావాట్ల ప్లాంట్‌ నుంచి మార్చి నెల కల్లా పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు.

సమావేశంలో డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) సత్యనారాయణరావు, ఎస్టీపీపీ చీఫ్‌ టెక్నికల్‌ కన్సల్టెంట్ సంజయ్‌కుమార్‌ సుర్‌, చీఫ్‌ ఆఫ్‌ ఓ అండ్ ఎంజె.ఎన్‌.సింగ్‌, జిఎం (సివిల్‌) రమేష్‌బాబు, జీఎం (సోలార్‌) సూర్యనారాయణరాజు, ఏజీఎం (ఫైనాన్స్‌) మురళీధర్‌, ఎస్వోటు డైరెక్టర్‌ (ఈ అండ్‌ ఎం) విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like