ష్‌.. గ‌ప్‌చిప్‌..

-న‌స్పూరు మున్సిపాలిటీలో కౌన్సిల‌ర్ల ర‌హ‌స్య మంత‌నాలు
-త‌న‌కు చైర్మ‌న్ ప‌ద‌వి కావాల‌ని అడుగుతున్న సీపీఐ కౌన్సిల‌ర్
-రాత్రి పొద్దుపోయే వ‌ర‌కు కొన‌సాగుతున్న చ‌ర్చ‌లు

Manchiryal : మంచిర్యాల జిల్లా న‌స్పూరు మున్సిపాలిటీలో రాజ‌కీయ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. మున్సిపాలిటీలోని కృష్ణ కాల‌నీలోని ఓ ప్రాంతంలో ప‌లువురు కౌన్సిల‌ర్లు ర‌హ‌స్యంగా స‌మావేశం అయ్యి చ‌ర్చ‌లు సాగిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో చైర్మ‌న్ పై అవిశ్వాసం పెట్టి ఎట్టి ప‌రిస్థితుల్లో ఆయ‌న‌ను దించేసేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

న‌స్పూరు మున్సిప‌ల్ చైర్మ‌న్ ఈసంప‌ల్లి ప్ర‌భాక‌ర్‌పై ప‌లువురు కౌన్సిల‌ర్లు పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని ఆస‌ర‌గా చేసుకున్న కొంద‌రు కౌన్సిల‌ర్లు అస‌మ్మ‌తి రాగం ఆల‌పిస్తున్నారు. ఆయ‌న‌పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే, దీనిని గ‌మ‌నించిన అధిష్టానం బుజ్జ‌గింపుల ప‌ర్వం మొద‌లుపెట్టింది. మంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్‌రావు కౌన్సిల‌ర్లు పిలిపించుకుని మాట్లాడారు. మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి ప‌నులూ జ‌ర‌గ‌డం లేద‌ని, చైర్మ‌న్ ఒక‌రిద్ద‌రికి మాత్ర‌మే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.

అయితే, ఎమ్మెల్యే తాను అంద‌రికీ న్యాయం ద‌క్కేలా చేస్తాన‌ని హామీ ఇచ్చారు. కానీ, అసంతృప్త కౌన్సిల‌ర్లు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఎమ్మెల్యే మాట్లాడిన త‌ర్వాత జ‌రిగిన కౌన్సిల్ స‌మావేశంలో ప్ర‌తిప‌క్ష కౌన్సిల‌ర్ల‌తో పాటు టీఆర్ఎస్ వారు సైతం గొడ‌వ‌కు దిగ‌డ‌మే కాకుండా, స‌మావేశాన్ని బ‌హిష్క‌రించారు కూడా. వైస్ చైర్మ‌న్ తోట శ్రీ‌నివాస్‌, కౌనిల‌ర్లు పూద‌రి కుమార్‌, బోయ మ‌ల్ల‌య్య‌, బౌతు ల‌క్ష్మి ఈ స‌మావేశం బ‌హిష్క‌రించారు. దీంతో ఈ వ‌ర్గం ఎట్టి ప‌రిస్థితుల్లో వెన‌క్కి త‌గ్గేలా క‌నిపించ‌డం లేద‌నే విష‌యం అర్ధం అయ్యింది.

అనుకున్న‌ట్టుగానే అంస‌తృప్త కౌన్సిల‌ర్లు అంతా సోమ‌వారం రాత్రి కృష్ణ కాల‌నీలో స‌మావేశం ఏర్పాటు చేసుకున్నారు. వైస్ చైర్మ‌న్ తోట శ్రీ‌నివాస్‌తో స‌హా ఎనిమిది మంది కౌన్సిల‌ర్లు ఈ స‌మావేశంలో పాల్గొని అవిశ్వాసం చ‌ర్చించారు. తాను ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని కాబ‌ట్టి సీపీఐ కౌన్సిల‌ర్ చంద్ర‌శేఖ‌ర్ చైర్మ‌న్ ప‌ద‌వి కావాల‌ని ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశం ఇంకా కొన‌సాగుతోంది. ఎట్టి ప‌రిస్థితుల్లో చైర్మ‌న్‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తున్న కౌన్సిల‌ర్లు మిగ‌తా వారి మ‌ద్ద‌తు కూడగ‌ట్టేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like