కుక్క‌ర్లు, గొడుగులు, చీర‌లు…

Elections: ఎన్నిక‌లు మ‌రో మూడు, నాలుగు నెల‌లు ఉన్నాయి.. ఇప్పుడే టిక్కెట్ల ద‌ర‌ఖాస్తులు.. ఎవ‌రికి టిక్కెట్టు వ‌స్తుందో తెలియ‌దు.. నాయ‌కులు, నేత‌లు ఇప్పుడిప్పుడే స‌మాయ‌త్తం అవుతున్నారు. కొంద‌రు నేత‌లు మాత్రం ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఇప్పుడే సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతూ వారికి తాయిలాలు ప్ర‌క‌టిస్తున్నారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో కొంద‌రు నేత‌లు ప్ర‌జ‌ల‌కు వాగ్ధానాలు చేస్తున్నారు. మ‌రోవైపు వ‌స్తు,ధ‌న రూపేణా ప్ర‌జ‌ల‌కు అందిస్తూ వారి మ‌న్న‌న‌ల‌ను చూర‌గొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఏది చేసినా అది కోడ్ కింద‌కు వ‌స్తుంది కాబ‌ట్టి ఇప్పుడే అన్నీ ప‌క్కాగా కానిచేస్తున్నారు. నేత‌లు ఓటర్లను బుట్టలేసుకునే ప‌నిలో చురుకుగా ముందుకు సాగుతున్నారు.

కోట్ల రూపాయ‌ల‌తో కుక్క‌ర్ల పంపిణీ..
ఆదిలాబాద్‌లో ఎన్ఆర్ఐ కంది శ్రీ‌నివాస్ రెడ్డి ఏకంగా కుక్క‌ర్ల పంపిణీ ప్రారంభించారు. ఆయ‌న ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు పెళ్లిలు, శుభకార్యాల్లో పాల్గొంటూ సొంత ట్రస్ట్ పేరిట బహుమతులు అందజేస్తున్నారు. ఇప్పటికే 40 వేల కుక్కర్లు తెచ్చి పంపకం ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. దానిపై కొంద‌రు ఫిర్యాదు చేయ‌డం పోలీసులు వ‌చ్చి వాటిని ప‌రిశీలించ‌డం కూడా జ‌రిగిపోయింది. బీజేపీ నుంచి టిక్కెట్టు ఆశించిన ఆయ‌న కాంగ్రెస్ గూటికి చేరారు. అక్క‌డా టిక్కెట్టు రాక‌పోతే ఖ‌చ్చితంగా స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకే ముంద‌స్తుగా ఈ పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌డుతున్నార‌ని చెబుతున్నారు.

మంత్రి గొడుగుల పంపిణీ..
ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సైతం తానేమీ త‌క్కువ తిన‌లేద‌ని ఆయ‌న కూడా గొడుగుల పంపిణీ ప్ర‌క్రియ ప్రారంభించారు. ఆయ‌న నిర్మల్లో పార్టీకలర్ తన ఫోటో, కేసిఆర్ ఫోటో ఉన్న గొడుగులను పంపిణీ చేస్తున్నారు. వర్షం పడుతుండగా రోడ్ల వెంట, మార్కెట్ లలో ఉండే చిరువ్యాపారులకు గొడుగులు అందజేశారు…ఇలా నియోజకవర్గంలో మొత్తం ఐకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ గొడుగులు అందజేస్తామని స్పష్టం చేశారు.

ముందే వ‌చ్చిన బ‌తుక‌మ్మ‌…
బ‌తుక‌మ్మ పండ‌గ‌కు ఇంకా నెలా ప‌దిహేను రోజుల స‌మ‌యం ఉంది. కానీ, బ‌తుక‌మ్మ పండుగ‌కు చీరల పేరుతో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావు, డీసీసీ అధ్య‌క్షురాలు సురేఖ ఇప్పుడే పంపిణీ చేస్తున్నారు. వాస్త‌వానికి వీరు ప్ర‌తి ఏటా చీరల పంపిణీ చేస్తారు. ఈ ఏడాది మాత్రం ముందుగా చీర‌లు పంచిపెడుతున్నారు. ఒక‌వేళ ఎన్నిక‌లు ముందుగా అనుకుంటే కోడ్ అడ్డం వ‌స్తుంద‌ని ముందుగానే చీర‌ల పంపిణీ చేప‌డితే ఓ ప‌ని అయిపోతుంద‌ని వారు భావిస్తున్నారు. అందుకే కొద్ది రోజులుగా ఈ చీర‌ల పంపిణీ సాగిస్తున్నారు. అంత‌కుముందు కూడా ఎండాకాలంలో ప్ర‌జ‌ల‌కు మంచినీరు, అన్న‌దానం చేశారు. ఇక న‌డిపెల్లి ట్ర‌స్టు పేరుతో ఎమ్మెల్యే దివాక‌ర్ రావు, ఆయ‌న త‌న‌యుడు విజిత్ సైతం ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు.

ఇంకా చాలా మంది నేత‌లు ఏమేం పంపిణీ చేస్తే బాగుంటుంద‌నే విష‌యంలో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఎన్నిక‌ల‌కు ఎలాగూ మందు, డ‌బ్బులు పంపిణీ చేయాల్సిందే. అంత‌కు ముందే ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లో ఉండేలా నేత‌లు, నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వ‌చ్చేది ద‌స‌రా, బ‌తుక‌మ్మ‌ల సీజ‌న్ కావ‌డంతో ప్ర‌జ‌ల‌కు పండుగ‌ల ఆఫ‌ర్ మారుమోగిపోనుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like