జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ

CM KCR: జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనలకు పోడు భూముల పట్టాల పంపిణీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజు వారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.

జూన్ 24 నుంచి 30 వ‌ర‌కు పోడు భూముల ప‌ట్టాల పంపిణీ చేస్తామ‌న్నారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మిగతా రైతులకు ఏ విధంగా రైతుబంధు అందుతున్నదో వీరికీ అదే పద్ధ‌తిలో రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ తెరిచి పోడు భూముల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధు జమచేస్తుందన్నారు. నూతనంగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకి అందజేయాలన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సిఎం తెలిపారు.

ఇండ్ల స్థలాల పంపిణీ :
అర్హులైన నిరుపేదలను గుర్తించి వారి ఇండ్ల నిర్మాణాల కోసం అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని పేద‌లకు అందించ‌నున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు.

జూలైలో గృహలక్ష్మి పథకం ప్రారంభం :
గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరితగతిన తయారు చేయాలని జూలైలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. జూన్ 14, వైద్య ఆరోగ్య దినోత్సవం రోజున‌ నిమ్స్ దవఖానా విస్తరణ పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. 2000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణానికి సిఎం కేసిఆర్ శంఖుస్థాపన చేయనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like