శ్రీ‌వారి సేవ‌కు డ‌బ్బులు ఇవ్వొద్దు..

Tirumala Srivari Seva స్వామివారి సన్నిధిలో ఉండి ఆయనకు సేవ చేసేందుకు వ‌చ్చే శ్రీ‌వారి సేవ‌కులు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

శ్రీవారి సేవ ఆన్లైన్ ద్వారా మాత్రమే కేటాయిస్తారని.. ఎవరైనా డబ్బులు తీసుకుని సేవ కేటాయిస్తామంటే న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు. సేవ సాప్ట్‌వేర్ ఖ‌చ్చితంగా ఉంటుందని, టీటీడీ సర్వర్‌ను ఎవరూ హ్యాక్ చేయలేరన్నారు. శ్రీవారి సేవ చేస్తున్న మహిళలను గౌరవప్రదంగా అమ్మ అని పిలవాలన్నారు. ప్రతిరోజు అంగప్రదక్షిణకు 750 టికెట్లు ఇస్తున్నట్లు టీటీడీ ఈవోతెలిపారు. ఇందుకోసం భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండవలసి వస్తోందన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నామన్నారు. తిరుమలలో డబ్బులు ఇవ్వొద్దని.. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

తిరుపతి జిల్లాను క్యాన్సర్‌ రహితప్రాంతంగా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామూహిక క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. స్విమ్స్‌లో త్వరలో లివర్‌ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ ఈవో. అలాగే స్విమ్స్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం రాష్ట్రంలో మరెక్కడా లేని హెచ్‌పిబి (హెపటో పాంక్రియాటో బిలియరీ) సర్టిఫికేట్‌ కోర్సును నిర్వహిస్తోంద‌న్నారు. ఎయిమ్స్ త‌దిత‌ర ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల్లో సూప‌ర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ చ‌దువుతున్న ఫైన‌లియ‌ర్ విద్యార్థులు ఈ కోర్సును అభ్య‌సిస్తున్నారన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like