ఆందోళ‌న వ‌ద్దు… అండ‌గా ఉన్నాం…

Balka Suman:వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. శనివారం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అడిషనల్ కలెక్టర్లు రాహుల్, మోతిలాల్, డీసీపీ రామ్ నాథ్ కేకన్ తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయ‌న మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు, జిల్లా యంత్రాంగం కృషితో నష్టాన్ని నియంత్రించగలిగామన్నారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల నియోజకవర్గంలో జరిగిన పంటనష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలని కోరారు. సమగ్ర నివేదిక అందిన వెంటనే 2 రోజుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, జిల్లాలో కురిసిన వర్షాల నివేదిక ఇప్పటికే అందించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ లైన్లను చాలా వరకు పునరుద్ధరించామని, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసేలా సమన్వయంతో పని చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం తక్కువగా ఉందన్నారు. భారీవర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రత్యేక అధికారిని కూడా ప్రభుత్వం నియమించిందని వెల్ల‌డించారు.

నదులు, వాగులు ఉప్పొంగే ప్రదేశంలో వాహనదారులను, ప్రజలను అటువైపు వెళ్ళకుండా పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో సిబ్బందిని బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. మండల అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి తీసుకోవలసిన చర్యలపై ప్రణాళిక రూపొందించాలని స్ప‌ష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో మురుగునీరు చేరిన చోట బ్లీచింగ్ చేయాలని, దోమలు వృద్ధి చెందకుండా దోమల నివారణ మందు పిచికారి చేయాలని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు పాటించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వంతెనలు, వాగులు, నదీ పరివాహక ప్రాంతాలలో భారీ కేడింగ్ ఏర్పాటు చేసి 24 గంటలు బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రస్తుత వరద పరిస్థితులలో అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. రహదారులు, వంతెనలు దెబ్బతిన్న ప్రాంతాలలో మరమ్మత్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి ప్రాణ నష్టము, పశు సంపద నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రజల సహాయార్థం కంట్రోల్ రూమ్ నం.08736-250501, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 7901628369 ఏర్పాటు చేసిన‌ట్లు సుమ‌న్ చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like