ఈ-శ్ర‌మ్‌తో ఎంతో మేలు

రైతులు, కార్మికులు, ఉపాధి కూలీలు అర్హులు

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఈ శ్ర‌మ్ తో రైతులు, కార్మికులు, ఉపాధి కూలీలకు ఎంతో మేలు జ‌ర‌గ‌నుంది. అసంఘంటిత రంగంలోకి కార్మికుల సంక్షేమానికి కేంద్రం ఈ శ్ర‌మ్ పేరుతో డేటాబేస్ వెబ్‌సైట్ ప్రారంభించింది. దీంట్లో న‌మోదు అయితే ప్ర‌భుత్వం క‌ల్పించే సామాజిక భ‌ద్ర‌త‌, సంక్షేమ ప‌థ‌కాలు వ‌ర్తిస్తాయి.
ఉప‌యోగ‌మేంటి..?
ఈ శ్ర‌మ్ పోర్ట‌ల్‌లో పేరు న‌మోదు చేసుకున్న కార్మికుడికి 12 అంకెల గుర్తింపు సంఖ్య‌తో కార్డు ఇస్తారు. దీని సాయంతో ప్ర‌భుత్వం క‌ల్పించే ప‌థ‌కాలు వ‌ర్తింప‌చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కుటుంబానికి సంబంధించి ఒక్క‌రికే ప‌థ‌కాలు వ‌ర్తించేవి. కానీ ఈ-శ్ర‌మ్‌లో కార్డు క‌లిగిన కుటుంబ స‌భ్యులంద‌రికీ ప‌థ‌కాలు వ‌ర్తించ‌నున్నాయి. ఇందులో న‌మోదైన ప్ర‌తి కార్మికుడికి ఏడాది పాటు ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న ద్వారా ప్ర‌మాద లేదా అంగ‌వైక‌ల్య బీమా రూ. 2 ల‌క్ష‌లు, పాక్షికంగా వైక‌ల్యం చెందితే రూ. ల‌క్ష అందిస్తారు.
ఎవ‌రు అర్హులు..?
అసంఘ‌టిత రంగంలో ప‌నిచేస్తూ 16-59 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉన్న వారు ఉచితంగా ఈ పోర్ట‌ల్‌లో చేర‌వ‌చ్చు. ఆదాయ‌ప‌న్ను చెల్లించే స్థాయి లేని వారు అర్హులే. వ్య‌వ‌సాయ అనుబంధ విభాగాల్లో ఉపాధిని పొందే చిన్న‌, స‌న్న‌కారు రైతులు, వ్య‌వ‌సాయ‌కూలీలు, ఉద్యాన‌వ‌నాలు, న‌ర్స‌రీలు, పాడిప‌రిశ్ర‌మ‌, మ‌త్స్య‌కారులు అర్హులు. భ‌వ‌న నిర్మాణ రంగంలో ప‌నిచేసే తాపీ కార్మికులు, త‌వ్వ‌కం, రాళ్లు కొట్టేవారు, సెంట్రింగ్‌, ప్లంబింగ్‌, కార్పెంట‌ర్లు, శానిట‌రీ, పెయింటింగ్‌, వెల్డింగ్‌, ఎల‌క్రిష్టియ‌న్‌, ఇసుక‌, సున్నం బ‌ట్టీల్లో ప‌నిచేసే కార్మికులు, క‌ల్లుగీత కార్మికులు, క‌ళాకారులు, రిక్షా, బీడీ కార్మికులు, చెత్త సేక‌రించేవారు అర్హులు. క్షౌర‌వృత్తి, ర‌జ‌కులు, తోపుడు బండ్ల వ్యాపారులు, వ‌ల‌స కార్మికులు పోర్ట‌ల్‌లో న‌మోదు చేసుకోవ‌చ్చు.
న‌మోదు ఎలా చేసుకోవాలి..?
గ్రామ స‌చివాల‌యం, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, సీఎస్‌సీ కేంద్రాలు, కార్మిక శాఖ కార్యాల‌యాల్లో ఈ-శ్ర‌మ్ స‌భ్య‌త్వ న‌మోదు చేసుకోవ‌చ్చు. కేవైసీ క‌లిగిన ఆధార్‌కార్డు అనుసంధాన‌మైన సెల్‌నంబ‌ర్‌, బ్యాంకు ఖాతా నంబ‌ర్‌, దాని ఐఎఫ్ఎస్ సీ కోడ్‌తో న‌మోదు కేంద్రాల‌కు వెళ్లాలి. ఆధార్ న‌మోదు చేయ‌గానే సెల్‌ఫోన్‌కు మెసేజ్ వ‌స్తుంది. సెల్‌ఫోన్ లేని వారు బ‌యోమెట్రిక్ ద్వారా న‌మోదు చేసుకోవ‌చ్చు. ఇలా చేసుకున్న వెంట‌నే వారికి ఈ-శ్ర‌మ్ కార్డు వ‌స్తుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like