ఏది నిజం…?

ముఖ్య‌మంత్రి ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని హైద‌రాబాద్ వ‌చ్చినా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఇంకా కొనసాగుతోంది. ప్ర‌ధాన‌మంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటున్న టీఆర్ఎస్ ఆరోపిస్తుండ‌గా, అస‌లు త‌మ‌ను అపాయింట్‌మెంట్ అడ‌గ‌లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేస్తోంది. ఇందులో ఏది నిజం అనేది తెలియ‌డం లేదు.

వ‌రి కొనుగోళ్ల విష‌యంలో కేంద్రంపై మండిపడుతూనే.. ధాన్యం కొనుగోలుపై తాడోపేడో తెల్చుకునేందుకు సీఎం కేసీఆర్ తన మంత్రులు, అధికారుల బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లారు. అంతకు ముందు ఇందిరా పార్క్ వద్ద కేంద్రం వైఖరి నిరసిస్తూ ఒకరోజు ధర్నా కూడా చేసిన విష‌యం తెలిసిందే.. మూడు రోజుల పాటు ఢిల్లీ టూర్‌కు ప్లాన్ చేసిన ముఖ్య‌మంత్రి గడిచిన ఆదివారం తన బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లారు.. మూడు రోజుల పాటు అక్కడే మ‌కాం వేశారు. సీఎం కేసిఆర్ కు ప్ర‌ధాని అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని టీఆర్ ఎస్ పార్టీ చెప్పింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌య‌ట‌కు కూడా వెళ్ల‌లేదు. కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రి పియూష్ గోయల్‌ను కలిసి చర్చించారు. ఆయన కూడా సరైన స్పష్టత ఇవ్వలేదని, యాసంగిలో బాయిల్డ్ రైస్ ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయమని స్పష్టం చేశార‌ని టీఆర్ ఎస్ ప్ర‌క‌ట‌న చేసింది.

వెనుదిరిగిన తెలంగాణ నేత‌ల‌ బృందం కేంద్రం త‌మ‌ని మరోసారి అవమానాలకు గురి చేసిందని చెప్పారు. కనీసం సీఎంతో చర్చించేందుకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శలు చేశారు.దీంతో పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేశారు. కేంద్రం వైఖరిని తూర్పార బట్టారు. దీంతో రాజకీయం మరింత ముదిరింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్ర కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలవడానికి తెలంగాణ సీఎం కార్యాలయం, ప్రభుత్వం నుండి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని స్పష్టం చేశాయి. గత సెప్టెంబర్ 1న అపాయింట్‌మెంట్‌ కోసం విజ్ఞప్తి వచ్చిందని, దాంతో అదే నెల 3న అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం, సీఎం కేసీఆర్‌ మోదీ, అమిత్‌షాను కలవడం జరిగిందని వివ‌రించాయి. తాజాగా మాత్రం ఎలాంటీ అపాయింట్‌మెంట్‌ కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని పేర్కొన్నాయి.

దీంతో సీఎం కేసీఆర్ మరోసారి ఇరుకున పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓవైపు వానాకాలం వరి ధాన్యం కొనుగోలుపై రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు సీఎం కేసిఆర్ రానున్నా యాసంగి ధాన్యం కొసం పోరాటం చేయడం కూడా రైతుల్లో వ్యతిరేకత ఎదురవుతోంది. దీనికి తోడు మూడు రోజుల పాటు డిల్లీలో మకాం వేసిన ఆయన సాధించింది ఏంటనేది ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు రైతుల్లో చర్చ మొదలైంది. కేసీఆర్ ఈ మ‌ధ్య వేస్తున్న ఎత్తుగ‌డ‌లు విఫ‌ల‌మ‌వుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like