ఈ విజ‌యం నాది కాదు.. వారిదే

-అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ
-భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము

‘రాష్ట్రపతి పదవికి చేరుకోవడం నా వ్యక్తిగత విజయం కాదు. భారతదేశంలోని ప్రతి పేదవాడి ఘనత. భారతదేశంలోని పేదలు కలలు కనడమే కాకుండా ఆ కలలను కూడా నెరవేర్చుకోగలరనడానికి నా నామినేషన్ సాక్ష్యం. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని పేదలు, దళితులు, వెనుకబడిన, గిరిజనులు.. న‌న్ను వారి ప్రతిబింబంగా చూస్తార‌నే సంతృప్తి నాకు ఉంటుంది.’ భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ఆమె తొలి ప్రసంగం చేశారు.

50 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల వేళ నా రాజకీయ జీవితం మొదలైంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. స్వాతంత్య్ర భారతదేశంలో పుట్టి.. దేశానికి తొలి రాష్ట్రపతి అయింది నేనే. మన స్వాతంత్య్ర సమరయోధులు, భారత పౌరుల అంచనాలను అందుకోవడానికి మన ప్రయత్నాలను వేగవంతం చేయాల’’ని ద్రౌపది ముర్ము అన్నారు.

ద్రౌపది ముర్ముతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె ఓత్ రిజిస్టర్‌పై సంతకం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన రామ్‌నాథ్ కోవింద్‌, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

అంతకుముందు ఈ రోజు ఉదయం ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులర్పించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవనానికి చేరుకున్నారు. రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్‌కోర్టులో ద్రౌపది ముర్ము, రామ్‌నాథ్ కోవింద్‌లు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పార్లమెంట్‌కు చేరుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like