సింగ‌రేణిలో ఎన్నిక‌ల న‌గారా

Singareni: సింగ‌రేణిలో ఎన్నిక‌ల న‌గారా మోగ‌నుంది. గుర్తింపు సంఘం ఎన్నిక‌ల‌పై సోమ‌వారం జ‌రిగిన స‌మావేశంలో ఎన్నిక‌ల‌పై కార్మిక సంఘాల‌న్నీ ఏకాభిప్రాయానికి వ‌చ్చాయి. రెండేళ్లుగా వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతుండ‌గా, ఎట్ట‌కేల‌కు ఒక అభిప్రాయం కుదిరింది. సింగరేణి కార్మిక సంఘాలతో సోమవారం హైదరాబాదులో డిప్యూటీ లేబర్ కమిషనర్ సింగరేణి ఎన్నికలకు సంబంధించి స‌మావేశం నిర్వ‌హించారు. వాస్త‌వానికి ఈ రోజే షెడ్యూలు విడుదల చేయాలని ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాలు పట్టుబట్టాయి. కానీ, మిగతా కార్మిక సంఘాలన్నీ అడ్డుచెప్పాయి. ఈనెల 21న సింగరేణి కార్మికులకు వేజ్ బోర్డు ఎరియర్స్ చెల్లిస్తున్నందున 22న షెడ్యూల్ విడుదల చేయాలని కోరడంతో మెజార్టీ కార్మిక సంఘాల విజ్ఞప్తిని పరిశీలించి 22న షెడ్యూల్ విడుదల చేసి అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించారు.

సింగ‌రేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. ఈరోజు నిర్వ‌హించే స‌మావేశం కూడా తూతూ మంత్రంగా సాగుతంద‌ని భావించారు. కానీ, ఈ విష‌యంలో అన్ని సంఘాలు ఏకాభిప్రాయానికి వ‌చ్చాయి. కార్మిక సంఘా లు, సింగరేణి అధికారులతో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో సోమవారం హైదరాబాద్ లో సమావేశం నిర్వ‌హించ‌గా, ఇందులో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఓటర్ల జాబితా ఎప్పుడు ప్రకటించాలి తదితర అంశాలపై చర్చించారు. ఇవ్వాళే షెడ్యూల్ ప్ర‌క‌టించాల‌ని రెండు సంఘాలు డిమాండ్ చేశాయి. మిగ‌తా సంఘాలు అభ్యంత‌రం చెప్ప‌డంతో షెడ్యూల్ ప్ర‌క‌ట‌న వాయిదా ప‌డింది.

అక్టోబ‌ర్ 28న ఎన్నిక‌లు..
దాదాపు రెండేళ్లుగా సింగ‌రేణి గుర్తింపు సంఘం ఎన్నిక‌లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. చివరిసారి ఎన్నిక‌లు 2017 అక్టోబర్లో నిర్వహించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపొందింది. ఈ సంఘం గుర్తింపు కాలపరిమితి 2021తో ముగిసింది. వెంటనే ఎన్నికలు నిర్వహిం చాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా ప‌డుతున్నాయి. ఈ అం శంపై సీపీఐ అనుబంధ సింగరేణి కోల్మైన్స్ యూనియన్ (ఏఐటీయూసీ) హై కోర్టును ఆశ్ర యించింది. అక్కడ కార్మిక సంఘాలకే అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ సింగరేణి సంస్థ ఎన్నికలు వాయిదా వేస్తోంది. వాస్త‌వానికి ప్ర‌భుత్వ‌మే వెన‌క‌డుగు వేసింద‌ని అందుకే ఎన్నిక‌లు వాయిదా ప‌డుతున్నాయ‌ని ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఎట్ట‌కేల‌కు అక్టోబ‌ర్ 28న ఎన్నిక‌లు నిర్వ‌హిస్తుండ‌టంతో కార్మికుల్లో ఆనందం వ్య‌క్తం అవుతోంది.

మారిన బీఆర్ఎస్ వైఖ‌రి..
ఇక్క‌డ ఎన్నిక‌లు అంటే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సెమిఫైన‌ల్ గా భావిస్తారు. దాదాపు 12 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్త‌రించి ఉన్న ఈ సింగ‌రేణిలో గెలిచినా ఓడినా అవి సాధార‌ణ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతాయి. సాధార‌ణ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఈ ప్రాంతాల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేకపోయింది. దీంతో అక్క‌డ ఎన్నిక‌లు నిర్వ‌హ‌ణ ప‌ట్ల ఆ పార్టీ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. కానీ, ఇప్పుడు మాత్రం బీఆర్ ఎస్ పార్టీ వైఖరిలో మార్పు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్పటికే కమ్యూనిస్టులతో తెగదెంపులు చేసుకున్నందున సింగ‌రేణిలో ఆ పార్టీ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీతో పొత్తు లేకుండానే ముందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. అన‌వ‌స‌రంగా ఎన్నిక‌లు ఆల‌స్యం చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవ‌డం కంటే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డ‌మే ఉత్త‌మ‌ని భావించారు. దీంతో ఈ రోజు స‌మావేశంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎన్నిక‌ల‌కు ఓకే చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like