మున్సిపాలిటీకి ఎన్నిక‌లు నిర్వ‌హించాలి

మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన సీపీఐ బృందం

ఎన్నో ఏండ్లుగా మంద‌మ‌ర్రి మున్సిపాలిటీకి ఎన్నిక‌లు లేక అభివృద్ధి కుంటుప‌డుతోంద‌ని ఇక్క‌డ వెంట‌నే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని సీపీఐ బృందం మంత్రి కేటీఆర్‌ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేసింది. మంద‌మ‌ర్రి మున్సిపాలిటీకి వ‌చ్చిన మంత్రిని క‌లిసిన నేత‌లు ప‌లు డిమాండ్ల‌తో కూడిన విన‌తిప‌త్రం అందించారు. మందమర్రి మున్సిపాలిటీలో సుమారుగా 60 వేల పైచిలుకు జనాభా ఉంద‌ని, మున్సిపాలిటీకి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడం వలన పాలక వర్గం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిపోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 1998 నుంచి ఇక్క‌డ ఎన్నిక‌లు లేవ‌ని వాపోయారు. ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని ముఖ్యమంత్రి హామీ ఇచ్చార‌ని, అయినా ఎన్నికలు నిర్వ‌హించ‌లేద‌న్నారు. మందమర్రి మున్సిపల్ అభివృద్ధిని, ప్ర‌జావసరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలలో ఆసరా పెన్షన్లు బ్యాంకుల ద్వారా వచ్చే విధంగా చొరవ తీసుకోవాల‌ని కోరారు.

ఇక, లెద‌ర్ పార్కును సైతం పునః ప్రారంభించాల‌ని కోరారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం లెదర్ పార్కు ఏర్పాటు చేసేందుకు మందమర్రి పాల చెట్టు ప్రాంతంలో 25 ఎకరాల భూమి సేకరించి శంఖుస్థాపన చేసింద‌న్నారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసినా, పనులు కొనసాగలేదని తెలిపారు. లెదర్ పార్కు ప్రారంభం జరిగితే మందమర్రి ప్రాంతానికి చెందిన దళిత యువతి, యువకులకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంద‌ని వెల్ల‌డించారు. మంత్రిని క‌లిసిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి శ్రీనివాస్, మందమర్రి పట్టణ కార్యదర్శి కామెర దుర్గ రాజ్, జిల్లా సమితి సభ్యులు శైలేంద్ర సత్యనారాయణ పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like