ఉపాధి మ‌స్ట‌ర్ ప‌డ్త‌లేదు

-స‌ర్వ‌ర్ బిజీతో అప్‌లోడ్‌కాని కూలీల ఫొటోలు
-ప‌ని చేసినా చేయ‌న‌ట్టేన‌ని ఆందోళ‌న‌
-వారం, ప‌ది రోజులుగా ఇదే పరిస్థితి

NREGS: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల‌కు మ‌స్ట‌ర్ ప‌డ‌క ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో ఆ ప‌థ‌కానికి సంబంధించి కూలీల హాజ‌రు ఆన్‌లైన్‌లో న‌మోదు చేయాలి. ప‌ని చేస్తున్న ప్ర‌దేశంలో ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ, స‌ర్వ‌ర్ మొరాయించ‌డంతో కూలీల‌కు హాజ‌రు ప‌డ‌క ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. వారం, ప‌ది రోజుల నుంచి ఇదే ప‌రిస్థితి అని అధికారులు చెబుతున్నారు.

ఉపాధి హ‌మీ ప‌థ‌కంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ఉపాధి హామీ కూలీల హాజరు మస్టర్లలో నమోదు చేసేవారు. ఒకరికి బదులు మరొకరు పనికి హాజరు కావడం, ఒకరే రెండు సార్లు సంతకాలు చేయడం వల్ల ఫేక్‌ హాజరుతో ప్రభుత్వ సొమ్ముకు గండి పడేది. దీన్ని అరికట్టడానికి ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసి సీయూజీ (కామన్‌ యూజర్‌ గ్రూప్‌) సిమ్‌ కార్డులను అందజేసింది. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు సార్లు కూలీల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. రెగ్యులర్‌గా కూలీల పేర్లు, ఫొటోలతో కలిపి అప్‌లోడ్‌ చేస్తేనే వారికి కూలీ అందుతుంది. కూలీల పేర్ల స్థానంలో క్లిక్‌ చేసి ఫొటో అప్‌లోడ్‌ చేయాలి. దీంతో ఉపాధి పనులకు హాజరు కాని వారి పేర్లను ఈ యాప్‌లో నమోదు చేయడానికి అవకాశం ఉండద‌ని, ఫేక్‌ హాజరుకు ఫుల్‌ స్టాప్‌ పెట్టవచ్చని ప్ర‌భుత్వం సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టింది.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, చాలా సంద‌ర్భాల్లో స‌ర్వ‌ర్ బిజీతో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. వారం, ప‌ది రోజులుగా స‌ర్వ‌ర్ బిజీగా ఉండ‌టంతో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. ఫోటోలు అప్‌లోడ్ కాక సిబ్బంది స‌త‌మ‌తం అవుతున్నారు. కూలీలు ప‌నిచేసినా ఫోటోలు అప్‌లోడ్ చేయ‌క‌పోతే మ‌స్ట‌ర్ లేన‌ట్టే. దీంతో ఫొటోలు అప్‌లోడ్ కాక‌పోవ‌డంతో కూలీలు ప‌నిచేసినా వారికి డ‌బ్బులు అందే అవ‌కాశం లేదు. చాలా సంద‌ర్భాల్లో ఉపాధి హామీ సిబ్బంది రాత్రి పొద్దుపోయే వ‌ర‌కు అప్‌లోడ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయినా, ఫొటోలు అప్లోడ్ అవ‌డం లేద‌ని చెబుతున్నారు. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రివి అప్‌లోడ్ అయి మ‌రికొంద‌రివి కావ‌డం లేదు. అధికారులు ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకుని ఈ స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like