ఎట్ల కొన‌డో చూద్దాం.. వ‌రి వేయండి

రైతుల‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు

హైదరాబాద్ : కేసీఆర్ స‌ర్కార్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడారు. వరి వేస్తే ఉరేనన్న సీఎం కేసీఆర్.. తన 150 ఎకరాల్లో వరి వేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల పొలాలు బిడులుగా మారాలి… కానీ నీ భూములు పచ్చని పొలం గానే ఉండాలా..? అని కేసీఆర్‌ను నిల‌దీశారు. యాసంగిలో వడ్లు వేయాల‌ని.. ఎట్లా కొనడో చూద్దామ‌ని స్ప‌ష్టం చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వం వింత వైఖరి అవలంభిస్తోందన్నారు. రైతుల పంటలకు దళారులు ధర నిర్ణయిస్తున్నారని చెప్పారు. పంటలకు ధర నిర్ణయించే హక్కు రైతులకు లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కొనని వాడు కుర్చీ మీద ఎట్లా కూర్చుంటాడని ఫైర్ అయ్యారు. వడ్లు కొన‌క‌పోతే… టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని బొంద పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. ఊర్లలోకి వ‌చ్చే… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులను చెప్పుతో కొట్టాల‌ని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని రేవంత్ మండిపడ్డారు. యూపీ, పంజాబ్‌ ఎన్నికల కోసమే సాగుచట్టాలు రద్దు చేశారని వ్యాఖ్యానించారు. ఎంఎస్‌పీ విధానం తెచ్చింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. రైతుల్ని బానిసలుగా చేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రైతు ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాలకు కేంద్రం సాయం చేయలేదని, కనీసం వారి వివరాలు కూడా సేకరించలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like