తెలంగాణ‌లో అన్నీ స్కాంలే

-ప్ర‌జాధ‌నం ప్ర‌జ‌ల‌కే చెందాల‌నేది కాంగ్రెస్ సిద్దాంతం
-తెలంగాణ ప్ర‌జ‌ల స్వ‌ప్నం నెర‌వేర‌లేదు
-బీఆర్ఎస్‌,బీజేపీ,ఎంఐఎం క‌లిసి ప‌నిచేస్తున్నాయి
-ఖానాపూర్‌, ఆసిఫాబాద్ స‌భ‌ల్లో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

Priyanka Gandhi :గిరిజనులు, ఆదివాసీ అభివృద్ధికి ఇందిర‌ ఎంతో కృషి చేశారని, ఆమె మరణించి 40 ఏళ్లు అయినా ఇంకా ఆరాధిస్తున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఆదివాసీ సంస్కృతి అత్యున్నతమైన సంస్కృతి అని స్ప‌ష్టం చేశారు. ఆదివారం ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో కాంగ్రెస్‌కు తెలుసన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీ కాంగ్రెస్‌ అని ప్రియాంక వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్ పాలనలో ప్రజల స్వప్నం నెరవేరలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో జీవితాలు మారతాయని ఉద్యమకారులు కలలు కన్నారని వారి క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాని స్ప‌ష్టం చేశారు. యువతకు కేసీఆర్‌ ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని, 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఉద్యమకారుల కటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ వైఫల్యం వల్లే యువత ఆత్మహత్యలు జరుగుతున్నాయని ప్రియాంక అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు అప్పులు పాలవుతున్నారని ప్రియాంకా ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు మద్ధతు ధర ఇస్తామని.. ప్రజాధనం ప్రజలకే చెందాలనేదే కాంగ్రెస్ విధానమన్నారు. రెండు సార్లు నమ్మి బీఆర్ఎస్‌కు ఓటు వేసి 10 ఏళ్లు వెనక్కిపోయారని .. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా వున్నారని ప్రియాంక చెప్పారు. ప్రజలకు జవాబుదారిగా వున్న నేతలను ఎన్నుకోవాలని.. ఆత్మపరిశీలన చేసుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పదేళ్లలో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ స్కాములేనని దుయ్య‌బ‌ట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసిందని చెబుతున్న మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రియాంక ప్రశ్నించారు. ప్రధాని మోడీ సీబీఐ, ఈడీని కాంగ్రెస్ నేతలపైనే ప్రయోగిస్తున్నారని.. తెలంగాణలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలా.. వద్దా అని ఆమె కోరారు.

స‌భ‌లో ఏఐసీసీ సెక్ర‌ట‌రీ రాహుల్ చౌద‌రి, క‌ర్ణాట‌క‌ ఎమ్మెల్సీ ప్ర‌కాష్ రాథోడ్, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి అశోక్ చౌహాన్, తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఎమ్మెల్యే రేఖా నాయ‌క్, డీసీసీ అధ్య‌క్షుడు విశ్వ ప్ర‌సాద్ రావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిల్ గౌడ్‌, ఎస్టీ సెల్ అధ్య‌క్షుడు విశ్వ‌నాథ్‌, ఎన్ఎస్‌యూసీ జిల్లా అధ్య‌క్షుడు ఆసిఫ్‌, మైనారిటీ జిల్లా అధ్య‌క్షుడు యూసుఫ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like