అంతా మా ఇష్టం

-కండువాల‌తోనే పోలింగ్ కేంద్రాల‌కు
-ప‌ట్టించుకోని ఎన్నిక‌ల అధికారులు,పోలీసులు
-నిబంధ‌న‌లు ఉల్లంఘించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య

బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థులు అంతా మా ఇష్టం అనే రీతిలో వ్య‌వ‌హరిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘించి మ‌రీ ముందుకు సాగుతున్నారు. వారు అలా ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘించినా అటు ఎన్నిక‌ల అధికారులు కానీ, ఇటు పోలీసులు కానీ క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మంత్రి, నిర్మ‌ల్ బీఆర్ఎస్ అభ్య‌ర్థి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఆయ‌న త‌న మెడ‌లో బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకునే లోప‌లికి వెళ్లారు. అలాగే ఓటు వేసి వ‌చ్చారు. వాస్త‌వానికి పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఎలాంటి గుర్తులు, కండువాలు ప్ర‌ద‌ర్శించ‌డం నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంది. కానీ, మంత్రి త‌న‌కు ఆ నిబంధ‌న‌లు వ‌ర్తించ‌వు అనుకున్నారో..? లేక తాను మంత్రినే క‌దా.. ఏమ‌వుతుంద‌ని భావించారో కానీ, అలాగే కండువాతో వెళ్లారు. ఎన్నిక‌ల అధికారులు కానీ, అక్క‌డ విధుల్లో ఉన్న పోలీసులు కానీ, క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం కొస‌మెరుపు.

ఇక‌, నిత్యం వివాదాల్లో ఉండే ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య సైతం మ‌రోమారు ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘించి మ‌ళ్లీ వివాదాల్లోకి ఎక్కారు. చిన్న‌య్య సైతం ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఆయ‌న సైతం త‌న మెడ‌లో కండువా వేసుకుని ఓటు వేసి వ‌చ్చారు. అక్క‌డ కూడా పోలీసులు, ఎన్నిక‌ల అధికారులు ప‌ట్టించుకోలేదు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like