ఖాకీల‌కు కాసులు..

-న‌కిలీ విత్త‌నాల వ్య‌వ‌హారంలో పోలీసుల చేతి వాటం
-పెద్ద ఎత్తున చేతులు మారుతున్న డ‌బ్బులు
-ఏటా కోట్ల‌లో వ్య‌వ‌హారం.. ప‌ట్టుకునేది ల‌క్ష‌ల్లోనే
-చిన్న చిన్న వ్యాపారులు మిన‌హా అస‌లు వాటిపై దృష్టేది..?
-ఇప్ప‌టికైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్న సామాన్యులు

Telangana Police: న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు రైతుల పాలిట శాపంగా మారుతుండ‌గా పోలీసుల‌కు మాత్రం ఇవి కాసులు కురిపిస్తున్నాయి. బెల్లంప‌ల్లి డివిజ‌న్‌లోని పోలీసుల‌కు ఇవి క‌ల్ప త‌రువుగా మారాయాంటే ఆశ్చ‌ర్యం లేదు. గ‌తంలో టాస్క్‌ఫోర్స్‌లో ప‌నిచేసిన చాలా మంది పోలీసులు వీటి పేరుతో ల‌క్ష‌లాది రూపాయ‌లు సంపాదించారు. అదే స‌మ‌యంలో చాలా ప్రాంతాల్లో పోలీసులు సైతం అక్ర‌మంగా పెద్ద ఎత్తున సంపాదించారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

గ‌తంలో ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు పోలీసులు, నిఘా బృందాలు కొమురంభీమ్ ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలో ఎవ‌రెవ‌రు న‌క‌లీ ప‌త్తి విత్త‌నాలు, గ్లైఫోసెట్ మందు అమ్ముతున్నార‌న్న స‌మాచారం సేక‌రించారు. అదే స‌మ‌యంలో ప‌లు చోట్ల దాడులు చేసి ప‌త్తి విత్త‌నాలు, గ్లైఫోసెట్ మందు సైతం ప‌ట్టుకున్నారు. అదే స‌మ‌యంలో చాలా మంది టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు క‌లిసి విత్త‌నాల వ్యాపారుల వ‌ద్ద వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు వినిపించాయి. దీంతో అప్ప‌టి క‌మిష‌న‌ర్ స‌త్య‌నారాయ‌ణ కొంద‌రు టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని బ‌దిలీ చేశారు. కొంద‌రు పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ద‌మ‌య్యారు. పై నుంచి వ‌చ్చిన ఒత్తిళ్ల నేప‌థ్యంలో అది కాస్తా సాధ్యం కాలేదు.

ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి నెల‌కొంది. జిల్లాలోని కొంద‌రు ఎస్ ఐలు న‌కిలీ విత్త‌నాల వ్యాపారుల గురించి తెలిసినా ప‌ట్టించుకోవ‌డం లేదు. ముందుగానే మాట్లాడుకుని వారిని చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేస్తున్నారు. బెల్లంప‌ల్లి డివిజ‌న్‌లో ఒక సీఐ న‌కిలీ విత్త‌న వ్యాపారుల వ‌ద్ద ల‌క్ష‌లు వ‌సూళ్లు చేస్తున్నారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక గ‌తంలో తాండూరు మండ‌లంలో ఉన్న ఓ ఆంధ్రా వ్యాపారి న‌కిలీ విత్త‌నాల రాకెట్‌లో దొరికితే అత‌ను రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశాడు. ఇప్పుడు సైతం ఆ వ్యాపారి ఓ ప్ర‌జాప్ర‌తినిధితో చెప్పించుకుని మ‌రీ విత్త‌నాలు అమ్ముతున్నాడు.

సీజ‌న్‌లో నెల‌కు ఇంత చొప్పున మాట్లాడుకుంటున్న వ్యాపారులు పోలీసుల‌కు మామూళ్లు ముట్ట చెబుతున్నారు. అప్పుడ‌ప్పుడు దాడులు చేయ‌డం మిన‌హా పోలీసులు దానిపై దృష్టి సారించ‌డం లేదు. విత్త‌నాలు కోట్ల‌లో వ‌స్తే కేవ‌లం వేల‌ల్లో ప‌ట్టుకుంటున్నారంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక ఇప్ప‌టికీ మంచిర్యాల‌, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఈ న‌కిలీ విత్త‌న దందా పెద్ద ఎత్తున సాగుతోంది. మ‌రి దానిని అరిక‌డ‌తారో లేక రైతుల మానాన వారిని వ‌దిలేస్తారో వేచి చూడాల్సిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like