మాస్ట‌ర్ ప్లాన్‌పై మంట‌లు

నిర్మ‌ల్ జిల్లాలో మాస్ట‌ర్ ప్లాన్ పై ర‌గ‌డ కొన‌సాగుతోంది. ఓ వైపు బీజేపీ నేత ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తుంటే, మ‌రోవైపు బీఆర్ఎస్ వాళ్ల‌ది ఎన్నిక‌ల స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇంకోవైపు మున్సిప‌ల్ అధికారులు అది కేవ‌లం ముసాయిదా మాత్ర‌మేన‌ని వ‌చ్చిన అభ్యంత‌రాలు, ఆక్షేప‌ణ‌లు ప‌రిష్క‌రిస్తామంటూ స్ప‌ష్టం చేస్తున్నారు. దీక్ష‌తో ఆగ‌ని బీజేపీ నిర్మ‌ల్ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రైవేటు స్కూళ్ల‌కు ఇప్ప‌టికే సెల‌వులు ప్ర‌క‌టించ‌గా, వ్యాపార వాణిజ్య వ‌ర్గాలు బంద్ లో పాల్గొంటున్నాయి.

ఈ మాస్టర్ ప్లాన్ సెగ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి తగులుతోంది. నిర్మల్‌ మున్సిపాలిటీలో మాస్టర్‌ప్లాన్‌పై రగడ మొదలైంది. ఈ మాస్టర్‌ప్లాన్ వెనుక.. బీఆర్‌ఎస్ నేతలకు వేరే ఆలోచనలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి. బడానేతలకు అనుకూలంగా మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌ రూపొందించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే.. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువులు, సర్కారు భూములను చెరబట్టిన బీఆర్ఎస్‌ నేతలు.. వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు కొత్త మాస్టర్ ప్లాన్‌ తయారు చేశారన్న చర్చ సాగుతోంది. సామాన్య రైతుల వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్‌ జోన్‌లోకి, ఇండస్ట్రియల్‌ జోన్‌ పరిధిలోని భూములను రెసిడెన్షియల్‌ జోన్‌లుగా చూపడంలో బీఆర్ఎస్‌ నేతల ఒత్తిడి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్‌ రగడలో.. ప్రధానంగా.. బైపాస్‌ రోడ్ల నిర్మాణాలకు సామాన్య రైతుల పంట పొలాలను చూపించడం.. రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. కమర్షియల్‌, ఇండస్ట్రీయల్‌, గ్రీన్‌ జోన్‌ల మార్పుతోపాటు చెరువుశిఖం, బఫర్‌జోన్‌ భూములను రిక్రియేషన్‌ జోన్‌ల పరిధిలోకి చేర్చడంపై వివాదాలు తలెత్తుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నేతల భూములను బఫర్‌జోన్‌ పరిధి నుంచి తప్పించేందుకే రిక్రియేషన్‌ జోన్‌ పరిధిలోకి మార్చారన్న వాదనలున్నాయి. దీంతో.. బడా బాబుల భూములను కాపాడుకునేందుకు.. అమాయకులు బలయ్యేలా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేశారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ మాస్ట‌ర్‌ప్లాన్ వ్య‌వ‌హారంలో 2 వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగిందంటూ బీజేపీ నేత మ‌హేశ్వ‌ర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, దాని వెన‌క మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి హ‌స్తం ఉంద‌ని ఈ కుంభ‌కోణంపై త‌న వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని వాటిని నిరూపించేందుకు తాను సిద్ధ‌మంటూ స‌వాల్ విసిరారు. అయితే, ఇది కేవ‌లం ఎన్నికల స్టంట్ మాత్ర‌మేన‌ని బీఆర్ఎస్ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. త‌మ ఉనికి చాటుకునే ప్ర‌యత్నంలో భాగంగానే మాస్ట‌ర్ ప్లాన్ ర‌ద్దు ఉద్య‌మ‌మ‌ని మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ కిషోర్ స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు అధికారులు సైతం ఇది ముసాయిదా మాత్ర‌మేన‌ని దానిపై వ‌చ్చే అభ్యంత‌రాలు ప‌రిష్క‌రిస్తామ‌ని చెబుతున్నారు. దీనిపై అన‌వ‌స‌ర ఆందోళ‌న‌లు వ‌ద్దంటూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఇక ఈ విష‌యంలో తాడోపేడో తేల్చుకునేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న బీజేపీ ఏలేటీ మ‌హేశ్వర్ రెడ్డి ఆమ‌ర‌ణ నిరాహ‌ర దీక్ష‌కు దిగారు. ఆ పార్టీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్ ఈటెల రాజేంద‌ర్ వ‌చ్చి ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపారు. మాస్ట‌ర్ ప్లాన్‌, ధ‌ర‌ణి పేరుతో కుంభ‌కోణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల్సిన నేత‌ల సొంత అజెండా అమ‌లు చేసుకుంటున్నార‌ని ఈటెల దుయ్య‌బ‌ట్టారు.

ఇక మాస్ట‌ర్ ప్లాన్ వ్య‌వ‌హారం బీజేపీ సీరియ‌స్‌గా తీసుకోవ‌డంతో అగ్ర‌నేత‌లు సైతం రంగంలోకి దిగ‌నున్నారు. మ‌హేశ్వ‌ర్ రెడ్డి దీక్ష‌కు మ‌ద్ద‌తుగా ఆ పార్టీ చీఫ్ కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ త‌దిత‌రులు వ‌స్తార‌ని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అదే జ‌రిగితే ఖ‌చ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like